వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి 

వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి

వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి 

వరంగల్ టైమ్స్, విశాఖపట్టణం : తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ విశాఖపట్టణంకు చేరుకుంది. అయితే ఆకతాయిలు ఈ రైలుపై రాళ్లతో దాడి చేశారు. త్వరలో ప్రారంభం కానున్న వందే భారత్ హై స్పీడ్ రైలు ట్రయల్ రన్ పై బుధవారం సాయంత్రం విశాఖ రైల్వే స్టేషన్ కు వచ్చిన వందే భారత్ రైలును అధికారులు పరిశీలించారు. అత్యంత వేగంగా గమ్యస్థానాలకు ప్రయాణికులను చేర్చే వందే భారత్ రైలు ప్రయాణికుల తాకిడి ఉంటుందని అధికారులు తెలిపారు. వందే భారత్ లో పూర్తిగా చైర్ కార్ బోగీలుంటాయని వెల్లడించారు.

కేవలం 8.40 గంటల్లో విశాఖ నుంచి సికింద్రాబాద్ చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ చేరుకున్న వందే భారత్ రైలును నిర్వహణ పర్యవేక్షణ కోసం న్యూ కోచింగ్ కాంప్లెక్స్ కు తరలించారు. ఈ రైలు పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. ఈ సీసీ కెమెరాలు లోకో పైలెట్ క్యాబిన్ కు అనుసంధానించి ఉంటాయి. లోకో పైలెట్ కంట్రోల్లోనే కోచ్ ల తలుపులు తెరుచుకునే, మూసివేసే విధంగా వ్యవస్థను రూపొందించారు. మెట్రో రైల్లో మాదిరిగా ప్రయాణికుల అత్యవసర సహాయం కోసం టాక్ బ్యాక్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.

అయితే గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు ట్రయల్ రన్ లో భాగంగా విశాఖకు వచ్చిన వందే భారత్ రైలు బోగీలపై కంచరపాలెం ప్రాంతంలో రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో రెండు కోచ్ ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఆర్పీఎఫ్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. రామ్మూర్తి పంతులు పేట గేటు దగ్గర ఆడుతున్న ఆకతాయిలు రైలుపై రాళ్లు విసిరినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన పై తక్షణమే స్పందించిన విశాఖ నగర పోలీసులు జీఆర్పీఎఫ్ కు, ఆర్పీఎఫ్ కు పూర్తిగా సహకరిస్తున్నారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ సీహెచ్. శ్రీకాంత్ వెంటనే నిందితులు గుర్తించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ రైలుపై ఇటువంటి సంఘటన జరగడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.