హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతో పాటుగా భారతదేశంలోని ముఖ్యనగరాలు, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో విస్తరించిన తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) తమతో కలిసి నడిచే వారి కోసం నూతన సభ్యత్వ ఆహ్వానం అందిస్తోంది. గ్లోబల్ కమిటీ సభ్యత్వం కోసం ఔత్సాహికులకు ఆహ్వానాన్ని ప్రకటించింది. టీటాకు చెందిన గ్లోబల్ కమిటీ – 2020 కాలపరిమితి ఈ డిసెంబర్ 31తో ముగియనున్న నేపథ్యంలో ఈ సభ్యత్వ కార్యక్రమం చేపడుతూ ఐటీ ఉద్యోగులు చేరవచ్చని వివరించింది. ఈ మేరకు టీటా గవర్నింగ్ కౌన్సిల్ నేడొక ప్రకటన విడుదల చేసింది. ఐటీ ఉద్యోగులు, కార్పొరేట్ మెంబర్‌షిప్, ఎన్నారైలు, విద్యార్థులు, అసోసియేట్ సభ్యులు, ఐటీ ఫ్యాకల్టీ, ప్రభుత్వ రంగం నుంచి ఐటీ విభాగంలో ఉన్నవారు సభ్యలుగా చేరవచ్చని వివరించింది. టీటా గ్లోబల్ కమిటీ ప్రస్తుత బృందం కాలపరిమితి ముగుస్తున్న నేపథ్యంలో 2021 కాలపరిమితికి చెందిన నూతన కమిటీకి సభ్యత్వాలను ఆహ్వానిస్తూ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటన వెలువరించింది. గ్లోబల్ కమిటీ సభ్యులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమిటీలు, జిల్లా కమిటీలకు సైతం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఔత్సాహికులకు సభ్యత్వం విషయంలో సహాయ సహకారాలు అందించాలని సూచించింది. ఔత్సాహికులు bit.ly/joinTITA లింక్ ద్వారా సభ్యులుగా చేరవచ్చు. నామినేషన్లు పంపేవారు telanganabit@gmail.com ఈమెయిల్‌కు ప్రతిపాదించవచ్చు. ‘తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ రాష్ట్ర ఆవిర్భావం ఉద్యమం సమయంలో కీలక పాత్ర పోషించడంతో పాటుగా తెలంగాణ ఏర్పడిన అనంతరం ప్రత్యేక రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తన వేదిక ద్వారా చేపట్టిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పలు కార్యక్రమాల్లో పాలుపంచుకొని వాటిని విజయవంతం చేసిందని వివరించారు. సాంకేతిక అక్షరాస్యత కోసం గ్రామాలను దత్తత తీసుకోవడం, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం కోసం డిజిథాన్ కార్యక్రమం చేపట్టడం, ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ఇంక్యుబేషన్ సెల్ ఏర్పాటు సహా అనేక ప్రక్రియలతో తెలంగాణ రాష్ట్ర చరిత్రలో టీటా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని వివరించారు. టీటా కృషిని చూసి దేశవిదేశాల్లో సైతం వివిధ శాఖలు ఏర్పాటు అయ్యాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో సమాజహితం కోసం సమయాన్ని కేటాయించి ముందుకు వచ్చే ఆసక్తి ఉన్నవారు, బాధ్యతగా భావించి పనిచేసే వారు సభ్యత్వ నమోదు చేసుకోవచ్చని ’టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల వివరించారు.