భారత్ లో 33కు చేరిన ఒమిక్రాన్ కేసులు

భారత్ లో 33కు చేరిన ఒమిక్రాన్ కేసులున్యూఢిల్లీ : భారత్ లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే 32 కేసులు నమోదవగా, తాజాగా న్యూఢిల్లీలో మరో కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో మొత్తం కేసులు 33 కు చేరాయి. జింబాంబ్వే నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం అతను లోక్ నాయక్ జయ్ ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతను ఈ మధ్యే దక్షిణాఫ్రికాకు వెళ్లివచ్చినట్లు సమాచారం.

అయితే ఢిల్లీకి వచ్చిన 27 మంది విదేశీ ప్రయాణికుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించామని అధికారులు తెలిపారు. అందులో 25 మందికి నెగెటివ్ వచ్చిందని, ఇద్దరికి మాత్రం ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు.

ఢిల్లీలో మొదటి కేసు నమోదైనప్పుడే మరిన్ని కేసులు వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో 17 నమోదు కాగా, రాజస్థాన్ లో 9, గుజరాత్ లో 3, కర్ణాటకలో 2, ఢిల్లీలో 2 చొప్పున నమోదయ్యాయి.