మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రుల సమీక్షములుగు జిల్లా : మేడారం సమ్మక్క, సారలమ్మ ఉత్సవం ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీ నేడు మేడారం సందర్శించింది. వనదేవతలకు మొక్కులు చెల్లించి సమీప పరిసరాలను పరిశీలించింది. ఈ సారి జాతరకు కోటిన్నరకు పైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో కొవిడ్ నిబంధనలు ఎలా పాటించాలన్న అంశాలతో పాటు, జాతర ఏర్పాట్లపై శనివారం మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ లు ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. మేడారం జాతర ప్రాంగణాన్ని దేవాదాయ శాఖామంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమీక్షలో మేడారం జాతరపై మంత్రులు స్పష్టత ఇచ్చారు. కరోనా నేపథ్యంలోనే జాతర జరపడానికి ఎలాంటి అడ్డంకులు లేవని వారు స్పష్టం చేశారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిపారు.
మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రుల సమీక్షమేడారం మహాజాతర కోసం ప్రభుత్వం రూ.350 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నదని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మేడారంలో పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. జాతరకు వచ్చే భక్తుల కోసం 4వేల బస్సులు, 10వేల సిబ్బందితో రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి ఇంద్రకరణ్ తెలిపారు. జంపన్న వాగులో స్నాన ఘట్టాలు ఏర్పాటు చేశామని, ఎవరికీ ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. లోపాలు ఉంటే సరిదిద్దుకుంటామని మంత్రి వివరించారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. ఆందోళన చేస్తున్న ఆదివాసి సంఘాలతో మాట్లాడతామని ఈసందర్భంగా మంత్రి వెల్లడించారు.
మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రుల సమీక్షఆదివాసి సంప్రదాయాలకు అనుగుణంగా జాతర నిర్వహిస్తామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకున్నా, రాజకీయం చేయాలని చూస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి ఆరోపించారు. కోట్ల రూపాయలతో కేసీఆర్ సర్కార్ జాతర నిర్వహణ ఏర్పాట్లు చేస్తుండటం గర్వించతగిన విషయమని మంత్రులు అన్నారు. మేడారం మహాజాతరకు వచ్చే కోటిన్నర పైగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ సమీక్షలో ఎంపీ కవిత, సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మేడారం ఈ. ఓ రాజేందర్, మేడారం ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు,ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.