లక్నవరం సస్పెన్షన్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రులు

లక్నవరం సస్పెన్షన్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రులు ములుగు జిల్లా : సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగంలో నిలబెట్టారని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇందులో భాగంగా జిల్లాకొక ప్రధాన పర్యాటక క్షేత్రం అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే పర్యాటక రంగంలో నంబర్ వన్ గా తీర్చిదిద్దే ప్రణాళిక చేస్తున్నారని మంత్రులు తెలిపారు. మేడారంలో జాతర సమీక్ష అనంతరం లక్నవరం పర్యటించిన మంత్రులు సస్పెన్షన్ బ్రిడ్జి , 24 కాటేజ్ లు, 2 గ్లాస్ కాటేజీలను ప్రారంభించారు.లక్నవరం సస్పెన్షన్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రులుఅనంతరం మంత్రులు లక్నవరం సరస్సులో బోట్ లో విహరిస్తూ కాసేపు ఎంజాయ్ చేశారు. బోట్ లో విహరిస్తూ లక్నవరం సరస్సు అందాలను వీక్షించారు. తెలంగాణలో గట్టమ్మ, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దామర్వాయి, మల్లూరు, బొగత జలపాతాలను ట్రైబల్ సర్క్యూట్ గా అభివృద్ధి చేసేందుకు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ ములుగు ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 79.87 కోట్ల రూపాయలతో చేపట్టినట్లు మంత్రులు తెలిపారు. ఇందులో భాగంగా లక్నవరంలో 27.65 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు మంత్రులు పేర్కొన్నారు.లక్నవరం సస్పెన్షన్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రులులక్నవరంలో ఉన్న 9 దీవులను అభివృద్ధి చేస్తాం..
సీఎం కేసీఆర్ పర్యాటక ప్రేమికులు కావడం వల్ల ఈ ట్రైబర్ సర్క్యూట్ ప్రాంతాలు గొప్ప పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయని మంత్రులు అన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి చూస్తుంటే తెలంగాణలో ఉన్నామా లేదా వేరే దేశంలో ఉన్నామా అన్నట్లు ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ కృషితోనే రామప్పకు యునెస్కో గుర్తింపు, పోచంపల్లికి ప్రపంచ పర్యాటక గ్రామంగా గుర్తింపు వచ్చిందని గుర్తు చేశారు. త్వరలోనే లక్నవరంలో అధునాతన పెద్ద బోట్ ను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. లక్నవరంలో ఉన్న 9 దీవులను కూడా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ ప్రాకృతిక పర్యాటక క్షేత్రాన్ని బాగా ప్రచారంలోకి తీసుకురావడానికి మీడియా సహకరించాలని మంత్రులు కోరారు. త్వరలోనే బొగత, మల్లూరు జలపాతాలను మరింత అభివృద్ధి చేస్తామని , ప్రపంచ హెరిటేజ్ లో తెలంగాణను గొప్పగా పెట్టుకుంటామని మంత్రులు అన్నారు.

గోవాను మించిన పర్యాటక క్షేత్రాలు తెలంగాణకు సొంతం..
లక్నవరంను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తుంది. సీఎం కేసీఆర్ కు ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ఎనలేని ప్రేమ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాకతీయుల వారసత్వాన్ని కాపాడడంతో పాటు పున:వైభవం తెచ్చారని అన్నారు. తెలంగాణ పర్యాటక క్షేత్రాల గురించి దేశ వ్యాప్తంగా ప్రచారం చేయాలని మంత్రులు కోరారు. గోవాను మించిన పర్యాటక క్షేత్రాలు తెలంగాణ సొంతమని అన్నారు. ఇందుకు గాను ఉమ్మడి వరంగల్ జిల్లా పక్షాన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ కు చేతులెత్తి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మంత్రులు టీజీవో డైరీని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.