రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలున్యూఢిల్లీ : సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉదయం సెంట్రల్ హాలులో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం చేయనున్నారు. రాష్ట్రపతి హోదాలో పార్లమెంట్‌లో రామ్‌నాథ్ కోవింద్‌కు ఇదే చివరి ప్రసంగం కానుంది. ఎందుకంటే ఈ ఏడాది జూలైతో రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం ముగియనుంది. రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన అనంతరం లోక్‌సభ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు రాజ్యసభ సమావేశం కానుంది.

మరోవైపు మంగళవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కాగా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తొలి రెండు రోజులు ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌లు ఉండవు. ఈసారి బడ్జెట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ, మౌలిక వసతుల కల్పన, మూలధన వ్యయం పెంపు లాంటి అంశాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.