న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, బీహార్ చీఫ్ సెక్రటరీలకు నేడు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. కొవిడ్ మృతులకు అందచేయాల్సిన నష్టపరిహారం కేసులో ఆ రెండు రాష్ట్రాలపై సుప్రీం సీరియస్ అయ్యింది. కొవిడ్ బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని గత తీర్పులో సుప్రీం ఆ రెండు రాష్ట్రాలను ఆదేశించింది. కానీ ఆ దిశగా ఆ రెండు రాష్ట్రాలు చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో నేడు సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏపీ, బీహార్ లకు చెందని చీఫ్ సెక్రటరీలు మధ్యాహ్నం 2 గంటలకు వర్చువల్ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
జస్టిస్ ఎంఆర్ షా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. చీఫ్ సెక్రటరీలు చట్టం కంటే ఎక్కువేమీ కాదన్నారు. ఆ ఇద్దరూ విచారణకు హాజరుకావాల్సిందేనని కోర్టు చెప్పింది. కొవిడ్ మృతిచెందిన బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని గతంలో కోర్టు ఆదేశించింది. ఎక్స్ గ్రేషియా విషయంలో మార్గదర్శకాలను రూపొందించాలని గత యేడాది జూన్ లో ఎన్డీఎంఏను కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.