ఎల్బీ స్టేడియంలో కేసీఆర్‌ బహిరంగ సభ

ఎల్బీ స్టేడియంలో కేసీఆర్‌ బహిరంగ సభహైదరాబాద్: గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్నది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఎల్బీ స్టేడియం ఇప్పటికే ముస్తాబయ్యింది. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటున్న మొదటి, ఏకైక బహిరంగసభ కావడంతో టీఆర్‌ఎస్‌ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా సభా ఏర్పాట్లను పూర్తిచేశారు. సాయంత్రం 4 గంటలకు సీఎం సభకు హాజరవుతారు. సుమారు గంటకుపైగా సీఎం ప్రసంగించే అవకాశం ఉన్నది. ఈ సందర్భంగా ప్రగతి నివేదిక, అభివృద్ధి ప్రణాళికలను వివరించనున్నారు. బహిరంగ సభకు నగరంలోని అన్ని డివిజన్ల నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలిరానున్నారు. బహిరంగ సభవద్ద మాస్కులు, శానిటైజర్లను సిద్ధంగా ఉంచారు. గ్రేటర్‌ ఎన్నికల్లో పోటీచేస్తున్న 150 మంతి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు సభలో పాల్గొననున్నారు. కాగా, ప్రధాని మోదీ నగర పర్యటన నేపథ్యంలో కేసీఆర్‌ సభపై ఆసక్తి నెలకొన్నది. సీఎం కేసీఆర్‌ సభ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం మీదుగా వెళ్లే వాహనాలను ట్రాఫిక్‌ పోలీసులు దారి మళ్లించనున్నారు.