జర్నలిస్టులకు టోల్ గేట్ ఫీజు మినహాయించాలి 

జర్నలిస్టులకు టోల్ గేట్ ఫీజు మినహాయించాలి

జర్నలిస్టులకు టోల్ గేట్ ఫీజు మినహాయించాలి 

వరంగల్ టైమ్స్, జనరల్ డెస్క్ : టోల్ గేట్ ఫీజు నుంచి జర్నలిస్టులకు మినహాయింపు ఇవ్వాలని టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ ఏఐ) సంస్థను కోరింది. ఈ అంశంపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ ఏఐ) రీజనల్ అధికారి కృష్ణప్రసాద్ ను టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బసవ పున్నయ్య బంజారాహిల్స్ లోని ఆయన కార్యాలయంలో కలిసారు. టోల్ గేట్ ఫీజు వల్ల జర్నలిస్టులు ఎదుర్కొటున్న సమస్యలపై ఎన్ హెచ్ ఏఐ అధికారి కృష్ణప్రసాద్ కు వినతిపత్రం సమర్పించారు.

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా సేవలందిస్తున్న జర్నలిస్టులకు టోల్ గేట్ ఫీజు వల్ల ఆర్థిక భారం పడుతుందన్నారు. న్యూస్ కవరేజీ కోసం హైవేలపై ప్రయాణించే జర్నలిస్టులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫెడరేషన్ ప్రతినిధులు వివరించారు. అక్రిడిటేషన్ కార్డులున్న జర్నలిస్టులకు ఆర్టీసీ బస్ పాస్ సౌకర్యం ఉన్నప్పటికీ రాయితీలో టోల్ ఫీజు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల మూడోవంతు రాయితీ తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అధికారులు, పొలిటికల్ లీడర్ల మాదిరిగానే జర్నలిస్టుల నుంచి కూడా టోల్ ఫీజు వసూలు చేయకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఈ విషయంపై స్పందించిన కృష్ణప్రసాద్ దేశవ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు పిల్లి రాంచందర్, జి. రఘు, హెచ్ యూజే అధ్యక్షుడు అరుణ్ కుమార్, కార్యదర్శి జగదీష్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.