కిషన్ రెడ్డికి దాస్యం బహిరంగ సవాల్ 

కిషన్ రెడ్డికి దాస్యం బహిరంగ సవాల్

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : బీజేపీ నాయకులపై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తీవ్రంగా మండిపడ్డారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించలేదని అసత్య ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భద్రకాళి అమ్మవారి సాక్షిగా ప్రమాణానికి రావాలని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సవాల్ విసిరారు. శనివారం వరంగల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమీవేశంలో చీఫ్ విప్ తో పాటు పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, మాజీ పార్లమెంట్ సభ్యుడు సీతారాం నాయక్ మాట్లాడారు.కిషన్ రెడ్డికి దాస్యం బహిరంగ సవాల్ విభజన హామీలపై కేంద్రంలోని బీజేపీ కేవలం ‘వద్దు, రద్దు’ విధానాన్ని మాత్రమే ఎంచుకుందని దాస్యం వినయ్ భాస్కర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై అత్యంత దుర్మార్గంగా, అహంకార పూరితంగా కేంద్ర మంత్రి రాజ్యసభలో సమాధానమివ్వడం విచారకరమన్నారు. రాష్ట్రంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధ్యం కాదన్న బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని చెప్పారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా పనికిరాడని విమర్శించాడు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం కిషన్ రెడ్డికి లేవని చీఫ్ విప్ దాస్యం దుయ్యబట్టారు. ‘బయ్యారం ఫ్యాక్టరీ వీలు కాదన్నారు. ఇప్పుడు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కుదరదు అంటున్నారని’ మండిపడ్డారు.

కోచ్ పరిశ్రమల అవసరం దేశంలో ఇక లేదని అస్సాం రాష్ట్రంలోని కోక్రాజహార్ ప్రాంతానికి ఎలా కేటాయిస్తారని దాస్యం ప్రశ్నించారు. అన్నీ పరిశ్రమలను గుజరాత్ కు తరలించుకుపోతున్న బీజేపీని తెలంగాణ నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ హక్కులను సాధించుకోవడానికి కేంద్రంలో ఎంతకైనా తెగించి పోరాడుతామని వారు స్పష్టం చేశారు. గిరిజన విశ్వవిద్యాలయం కోసం తెలంగాణ సర్కార్ స్థలం కేటాయించి కేంద్రానికి అప్పటించినప్పటికీ ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అత్యంత బాధాకారమైన అంశమని మాజీ ఎంపీ సీతారాంనాయక్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.