ఆన్లైన్ లో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు 

ఆన్లైన్ లో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు

వరంగల్ టైమ్స్, డెవోషనల్ డెస్క్ : తిరుమల ప్రత్యేక, వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను శనివారం టీటీడీ బోర్డు ఆన్లైన్ లో విడుదల చేసింది. జనవరి 1 నుంచి 11 వరకు 2.20 లక్షల టికెట్లను అందుబాటులో ఉంచారు. టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో ఈ టికెట్లను కొనుగోలు చేయాలని టీటీడీ బోర్డు భక్తులకు సూచించింది. ఆన్లైన్ లో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు జనవరి 2 న వైకుంఠ ఏకాదశి, 3న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. నూతన సంవత్సరంను పురస్కరించుకుని జనవరి 1 నుంచి 11 వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఆన్లైన్ కోటాను టీటీడీ విడుదల చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

*డిసెంబర్ 27న వీఐపీ బ్రేక్ దర్శనాలుండవు..
ఈ నెల 27న తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆ రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ అనుమతించదు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 26న ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించరని, భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ కోరింది.