బీజేపీపై మండిపడ్డ మంత్రి జగదీశ్ రెడ్డి

భాగ్యనగరం పై బాంబులు వేస్తారా..?
ప్రపంచదేశాలను అక్కున చేర్చుకున్నది హైదరాబాద్
అటువంటి కన్నతల్లిపై సర్జికల్ స్ట్రైక్ లా …
మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటుబీజేపీపై మండిపడ్డ మంత్రి జగదీశ్ రెడ్డిహైదరాబాద్ : బీజేపీకి ఓటు వేయకుంటే భాగ్యనగరంపై బాంబులతో దాడులు చేస్తారా..? అని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. జీ హెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఉదయం కొత్తపేట డివిజన్ లో మంత్రి విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రపంచ దేశాలను కన్నతల్లిలా అక్కున చేర్చుకున్నది హైదరాబాదని అటువంటి నగరం పై సర్జికల్ స్ట్రైక్ లంటూ కమలనాథులు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రజలకు కావాల్సింది మౌలిక సదుపాయాలు మాత్రమేనని అటువంటి అంశాలను విస్మరించి సర్జికల్ స్ట్రైక్ లంటూ నగర ప్రజల్లో భయాందోళనలను సృష్టించేందుకు బీజేపీ కుట్రలు పడుతుందని ఆయన ఆరోపించారు.2014 కు ముందు నగరంలో అదుపు తప్పిన శాంతి భద్రతలను సీఎం కేసీఆర్ నాయకత్వం లో ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం అదుపులో పెట్టిందన్నారు. గతంలో నగర శివారులో నివాసం ఉండాలంటేనే జనం జంకేవారన్నారు.వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం రక్షణ కల్పించిందన్నారు. సీసీ కెమెరాలు, షీటీం లతో నగరంలో శాంతి భద్రతలు కల్పించారన్నారు. సర్జికల్ స్ట్రైక్ అంటూ బీజేపీ నేతలు చేస్తున్నకుట్రలను తిప్పికొట్టాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో బల్దియా పీఠం టీ ఆర్ఎస్ కు దక్కించుకోవడంతో రూ. 65 వేల కోట్ల రూపాయలతో నగరాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో భువనగరి ఎమ్మెల్యే పెళ్ల శేఖర్ రెడ్డి కొత్తపేట కార్పొరేటర్ అభ్యర్థి విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.