భక్తుల కాటేజీలపై టీటీడీ కీలక నిర్ణయం
వరంగల్ టైమ్స్, తిరుమల : తిరుమలలో భక్తుల కాటేజీలకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలోనే కొన్ని కాటేజీల్లో వసతులను పెంచుతూ టీటీడీ మరమ్మత్తులు చేసింది. ఆ సమయంలో కొన్ని కాటేజీల అద్దెను పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుమలలో మొత్తం భక్తుల కోసం 7500 గదులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు నాలుగు యాత్రికుల ఉచిత సముదాయాలు ఉన్నాయి. తాజాగా తిరుమలలో కాటేజీల్లో రూ.116 కోట్లతో ఆధునికీకరణ చేశారు. ఇక ఇప్పుడు మరమ్మతులకు గురైన కాటేజీల పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియలో భాగంగా మరో నిర్ణయం టీటీడీ ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం ఆధునీకరించిన కాటేజీల్లో సామాన్య భక్తులకు ఎక్కువగా కేటాయించే వసతి గదుల అద్దె పెంచలేదు.ప్రత్యేక ప్రవేశ దర్శనం పొందే భక్తులకు కేటాయించే వెయ్యి రూపాయాలు అంతకంటే ఎక్కువ ధరలతో ఉన్న 1200 గదులకు సంబంధించి పెంపు నిర్ణయం అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆన్ లైన్ లో వీటని కేటాయిస్తున్నారు. పద్మావతి, ఎంఎబిసీ ప్రాంతంలో సౌకర్యాలు ఎక్కువగా ఉన్న గదుల అద్దె ఎక్కువగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. దాదాపుగా 1344 గదుల అద్దె పెంచుతూ నిర్ణయించారు. అవి కూడా వీఐపీలకు కేటాయించేవిగా స్పష్టం చేసారు. నారాయణ గిరి, ఎస్వీ గెస్ట్ హౌస్ అద్దె పెంచినట్లు చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం తిరుమలలో మరమ్మతులకు గురైన కాటేజీల పునర్నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. తిరుమలలోని 13 విశ్రాంతి గృహాల పునర్నిర్మాణం, పునరుద్ధరణకు కాటేజీ డోనర్ స్కీం కింద దాతల నుంచి టెండర్లను ఆహ్వానించారు. అందులో భాగంగా…హెచ్‌వీడీసీలోని ఓ కాటేజీ నిర్మాణానికి రికార్డుస్థాయిలో దాదాపు రూ.21 కోట్లకు టీటీడీ బోర్డు సభ్యుడు జీవన్‌రెడ్డి టెండర్ వేసినట్లు తెలుస్తోంది. రూ.5.50 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు పలువురు టెండర్లు వేసి టీటీడీకి విరాళం అందజేశారు.
తాజాగా హెచ్‌వీడీసీలో 493, 496 కాటేజీలతో పాటు టీబీసీలోని మరో ఏడు కాటేజీల పునర్నిర్మాణానికి కనీస విరాళం రూ.5 కోట్లుగా నిర్ణయించి టీటీడీ టెండర్లు ఆహ్వానించింది. పలువురి నుంచి వచ్చిన సీల్డ్ కవర్ టెండర్లను అధికారులు ఓపెన్ చేసారు. అధిక మొత్తంలో టెండర్లు వేసిన వారికి కాటేజీల నిర్మాణాన్ని ఖరారు చేశారు. టెండరు వేసిన దాతలు నెలరోజులలోపు మొత్తం విరాళాన్ని టీటీడీకి చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం కాటేజీ నిర్మాణానికి వీరిని అనుమతిస్తారు. కాగా కాటేజీ డోనర్ స్కీం కింద నిర్మాణం పూర్తిచేసిన భవనంలో ఓ గదిని దాతకు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.