వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : బాల్కొండ నియోజకవర్గంలో గులాబీ హవా కొనసాగుతోంది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఏకపక్ష విజయం సాధించడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ కు సన్నిహితుడిగా ముద్రపడ్డారు. కీలక సమయాల్లో సీఎం కేసీఆర్ వెన్నంటి ఉంటూ హైలైట్ అవుతున్నారు. ఆయన సమర్థతను గుర్తించి, ప్రశాంత్ రెడ్డిని సీఎం దగ్గరకు తీసుకున్నారని టాక్.
*కాంగ్రెస్ కంచుకోటను బద్దలుకొట్టిన బీఆర్ఎస్
బాల్కొండ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి ఇక్కడ వరుసగా నాలుగుసార్లు గెలిచి సత్తా చాటారు. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు గులాబీ గాలి వీస్తోంది. కనీసం చూద్దామన్నా ఇతర పార్టీల జాడలేదు. అంతమాత్రాన ఇతర పార్టీలు రాకుండా ప్రశాంత్ రెడ్డి ఏమైనా అడ్డుకుంటున్నారా అంటే అదీ లేదు.ఆ స్థాయిలో ప్రజల్లో మంచి గుర్తింపును పొందడంలో విజయం సాధించారు ప్రశాంత్ రెడ్డి.
*అభివృద్ధే మంత్రి ప్రశాంత్ కి ప్లస్ పాయింట్..
ఒకప్పుడు అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన బాల్కొండ నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నియోజకవర్గ రూపురేఖలే మారిపోయాయి. గ్రామగ్రామాన అభివ్రుద్ధి జరుగుతోంది. ప్రజా సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఇంటికీ చేరుతున్నాయి. నియోజకవర్గ రైతులు సంతోషంగా ఉన్నారు. అన్నివర్గాల జనం ఎమ్మెల్యే పనితీరును మెచ్చుకుంటున్నారు. ప్రశాంత్ రెడ్డి మంత్రిగానూ ఉండడంతో బాల్కొండపై అందరి ఫోకస్ పెరిగింది. అందుకే మొత్తం నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఈజీగా గెలిచే స్థానాల్లో బాల్కొండ ముందుంది.
*ప్రత్యర్థులు పోటీ చేసేందుకు భయపడుతున్నారా..
బాల్కొండ నుంచి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలవడం లాంఛనమే. కానీ ప్రశాంత్ రెడ్డి ప్రత్యర్థి ఎవరో ఇప్పటిదాకా క్లారిటీ లేదు. మాజీ ఎమ్మెల్యే అనిల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారో లేక ఆయన మరో నియోజకవర్గం చూసుకుంటారో తెలియదు. ఆయన వేరే నియోజకవర్గానికి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మంత్రి ప్రశాంత్ రెడ్డిపై పోటీ చేసేందుకు కూడా ప్రత్యర్థి పార్టీలు ఆలోచిస్తున్నాయి. ఆ స్థాయిలో ప్రశాంత్ రెడ్డికి ప్రజల్లో పలుకుబడి ఉంది. పనులు చేసి పట్టే సత్తా ఆయనకు ఉంది. బాగా పనిచేసే మంత్రుల లిస్టులో ఆయన పేరు కూడా ఉందంటే అతిశయోక్తి కాదు.
మొత్తంగా బాల్కొండ నియోజకవర్గంలో ఇప్పుడు మంత్రి ప్రశాంత్ రెడ్డి గెలుపు లాంఛనమేనంటున్నారు గులాబీ శ్రేణులు. ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ఆయనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో ఆయనకున్న మంచి పేరుతో గతం కంటే ఈసారి మెజార్టీ మరింత పెరుగుతుందని ఆ పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు.
రాజకీయ విశ్లేషకులు సైతం మంత్రి ప్రశాంత్ రెడ్డి పనితీరు అద్భుతమని ప్రశంసిస్తున్నారు. కచ్చితంగా ఆయన గెలుపు ఖాయమని అంచనా వేస్తున్నారు. మరి ప్రజల తీర్పు ఏ రకంగా ఉంటుందో వేచి చూడాలి.