డిసెంబర్‌ 7నుంచే మళ్లీ వరదసాయం అందిస్తాం: కేసీఆర్

డిసెంబర్‌ 7నుంచే మళ్లీ వరదసాయం అందిస్తాం: కేసీఆర్హైదరాబాద్‌: అందమైన మూసీనదిని ప్రజెంట్‌ చేసే బాధ్యత నాది. తపన, సంకల్పం, కార్యాచరణ ఉన్న ప్రభుత్వం మాదని సీఎం కేసీఆర్‌ అన్నారు. డిసెంబర్‌ 7 నుంచే మళ్లీ వరదసాయం అందిస్తామని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికల ప్రచార సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ‘హైదరాబాద్‌ వరదలు చూసి చలించిపోయా. లక్షల మంది పేదల బతుకులు ఆగమవడం చూసి చాలా బాధపడ్డాను. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు సాయం అందజేశాం. డిసెంబర్‌ 7 తర్వాత వరద సాయం అందని వారికి అందిస్తాం. హైదరాబాద్‌ ప్రజలకు హామీ ఇస్తున్నా.. మరో రూ.300 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వెనుకాడదు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ సాయం అందిస్తాం. ప్రధానిని రూ.1300 కోట్ల సాయం అడిగితే 13 పైసలు కూడా ఇవ్వలేదు. మేం భారతదేశంలో లేమా. బెంగళూరు, అహ్మదాబాద్‌ నగరాలకు సాయం ఇవ్వలేదా’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు.