కరీంనగర్ బండి ఎక్కేదెవరు ?
వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : కరీంనగర్ అంటే ఒకప్పుడు గులాబీదళానికి కంచుకోటగా ఉండేది. సీఎం కేసీఆర్ కు కరీంనగర్ ఎంతో కలిసొచ్చిందని చెబుతుంటారు. కానీ 2018 ఎంపీ ఎన్నికల్లో ఆ సెంటిమెంటును తిరగరాశారు బండి సంజయ్. కరీంనగర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన సిట్టింగ్ ఎంపీ వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో ఓడించారు. గులాబీ గడ్డపై బీజేపీ జెండాను రెపరెపలాడించారు.
*బండితోనే కమలానికి క్రెడిట్ !
బండి సంజయ్ ఏ క్షణాన కరీంనగర్ ఎంపీగా గెలిచారో కానీ ఆయనకు లక్ కలిసొచ్చింది. ఏకంగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడైపోయారాయన. సీనియర్లను కూడా కాదని ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న బండి సంజయ్ కి.. తెలంగాణ బీజేపీ చీఫ్ పోస్టు ఇచ్చింది అధిష్టానం. అప్పటిదాకా నిస్తేజంగా ఉన్న కమలంలో జోష్ వచ్చిందంటే కారణం బండి సంజయ్ అనే అంటారు ఆ పార్టీ శ్రేణులు. దానికి కారణాలేవైనా ఆ క్రెడిట్ అంతా బండి సంజయ్ దే అని ఘంటాపథంగా చెబుతుంటారు.
*కేసీఆరే టార్గెట్ చేయడంలో బండే నం.1 !
క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీలో బండి సంజయ్ వచ్చిన తర్వాత అంతా మారింది. కేసీఆర్ ఒకటంటే పది అనాలి అన్నట్లుగా పరిస్థితి మారింది. అందుకే కేసీఆర్ ఏం మాట్లాడినా బండి సంజయ్ కౌంటరిస్తారు. కేసీఆర్ ను కార్నర్ చేయడంలో ఆయన తర్వాతే ఏ పార్టీ అయినా. చివరికి కాంగ్రెస్ నుంచి గట్టోడు రేవంత్ రెడ్డి ఉన్నా.. ఆయన కంటే ముందు రియాక్షన్ బండి సంజయ్ నుంచే వస్తుందంటే అతిశయోక్తి కాదు.*ఎంపీగా పెరిగిన బండి గ్రాఫ్.. పనుల్లో మాత్రం జీరో !
బండి సంజయ్ గ్రాఫ్ స్టేట్ మొత్తం అమాంతంగా పెరగడంతో కరీంనగర్ ఎంపీ స్థానంలోనూ ఆయనకు అనుకూల పరిస్థితులే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఏమీ చేయలేదనే విమర్శలు కూడా బలంగా ఉన్నాయి. ఎంపీగా కరీంనగర్ కు ఏం చేశారో బండి సంజయ్ చెప్పాలని బీఆర్ఎస్ పదే పదే డిమాండ్ చేస్తోంది. ఈ వాదన ప్రజల్లోకి బలంగా వెళ్తే మాత్రం ఆయనకు కష్టకాలమేనన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే వాస్తవానికి కూడా కరీంనగర్ ఎంపీగా ఆయన పెద్దగా చేసిందేమీ లేదు. సెంటిమెంటుతోనే ఆయన నెట్టుకొస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బండి సంజయ్ వర్గం మాత్రం అదేమీ లేదని కొట్టేస్తున్నా ఇదే ఆయనకు పెద్ద మైనస్ గా మారే ప్రమాదం ఉంది.
*ఎమ్మెల్యేగా ఐతేనే బెటర్ అని అనుకుంటున్నాడట..
ఇక అన్నింటికంటే ముఖ్యంగా సిట్టింగ్ స్థానంలో బండి సంజయ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంజయ్ ఎంపీ కంటే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే సుముఖంగా ఉన్నారట. కుదిరితే కరీంనగర్ ఎమ్మెల్యే స్థానం నుంచి గంగుల కమలాకర్ పై పోటీ చేయాలని సంజయ్ భావిస్తున్నట్లు టాక్. ఈసారి గంగులను ఓడించి, రాష్ట్రవ్యాప్తంగా హైలైట్ కావాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
*ఎంపీ స్థానానికి తెరపైకి పలువురి పేర్లు
బండి సంజయ్ పోటీచేయకపోతే బీజేపీ నుంచి కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. సీహెచ్ విద్యాసాగర్ రావు, మురళీధర్ రావు లాంటి బడా నాయకుల పేర్లయితే వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి మరోసారి వినోద్ కుమార్ పోటీ చేయడంపైనా అనుమానాలున్నాయి. ఎంపీగా కంటే ఎమ్మెల్యేగా పోటీచేసేందుకే ఆయన కూడా ఆసక్తిగా ఉన్నారట. హైకమాండ్ ఒత్తిడి తెస్తే తప్ప మరోసారి ఆయన ఎంపీగా పోటీచేయకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ విషయానికొస్తే పెద్ద పేరున్న నేతల పేర్లేవీ వినిపించడం లేదు.
,అభ్యర్థులను బట్టి కాకుండా పార్టీ పరంగా చూస్తే బీజేపీకే అడ్వాంటేజ్ ఉందన్న వాదన వినిపిస్తోంది. అయితే ఎంపీ ఎన్నికల నాటికి తెలంగాణలో ఎమ్మెల్యే ఎలక్షన్ పూర్తవుతుంది. కాబట్టి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో అడ్వాంటేజ్ ఉండొచ్చన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లోలాగే ఎంపీ ఎలక్షన్ లో బీజేపీకి వేవ్ ఉంటే, అభ్యర్థి ఎవరన్నది పెద్దగా కౌంట్ లోకి రాదు. కానీ కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన తరుణంలో ఈసారి కరీంనగర్ ఎంపీ స్థానంలో బీజేపీకి వేవ్ ఉంటుందా అన్నది చెప్పలేం. వేవ్ ఉన్నా లేకపోయినా కమలం పార్టీకి వన్ సైడ్ వార్ మాత్రం ఉండదు. కచ్చితంగా టఫ్ ఖాయం. అభ్యర్థి ఎవరైనా బీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగే అవకాశాలే ఉన్నాయి.