పెంపుడు కుక్క ఉంటే ఈ రూల్స్ పాటించాల్సిందే !

పెంపుడు కుక్క ఉంటే ఈ రూల్స్ పాటించాల్సిందే !

పెంపుడు కుక్క ఉంటే ఈ రూల్స్ పాటించాల్సిందే !వరంగల్ టైమ్స్, హైదరాబాద్: గ్రేటర్‌తో పాటు శివారు మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కల బెడదను నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఐదున్నర లక్షల వీధి కుక్కలున్నాయని తెలిపారు. గతంలో 8 లక్షల 50వేలు ఉండేవని (2011) స్టెరిలైజేషన్‌ ఆపరేషన్స్‌ నిర్వహించడం వల్ల వాటి సంఖ్య ఐదు లక్షల 50వేలకు తగ్గిందని అర్వింద్‌కుమార్‌ తెలిపారు.

వాటికి వెంటనే ఏబీసీ (యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌) స్టెరిలైజేషన్‌ ఆపరేషన్లు నిర్వహించాలని, ఆయా కాలనీల్లో కొన్ని నీటి నిల్వ సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న హోటల్స్‌, రెస్టారెంట్స్‌, ఫంక్షన్‌ హాల్స్‌, చికెన్‌, మటన్‌ సెంటర్లు వ్యర్థాలను వీధుల్లో వేయకుండా కట్టడి చేయాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. నగరంలో కుక్కల సంఖ్యను నిరోధించడానికి తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు.

*పెంపుడు జంతువుల నమోదుకు ప్రత్యేక యాప్‌
పెంపుడు జంతువుల నమోదుకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను సిద్ధం చేయాలని అధికారులకు అర్వింద్‌కుమార్‌ సూచించారు. వీటికి సంబంధించిన ఫిర్యాదులను ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్‌,
040 21111111 ద్వారా నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నగర పరిధిలో, పరిసర మున్సిపాలిటీల పరిధిలో పెంపుడు కుక్కల సంఖ్యను గుర్తించడానికి త్వరలో మొబైల్‌ యాప్‌ను కూడా రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆ యాప్‌లో సంబంధిత యాజమానులు నమోదు చేసుకోవాలని, తద్వారా గుర్తింపు కార్డును మంజూరు చేస్తామని చెప్పారు. ఎకువగా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో వెటర్నరీ బృందాలను తరలించి కుక్కలను కట్టడి చేయడానికి తగు చర్యలు చేపట్టాలని సూచించారు. మూసీ పరివాహక ప్రాంతంలో కూడా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.