ఆకాశంలో నేడు అద్భుతం

చేరువ కానున్న బృహస్పతి ,శని గ్రహాలు ఆకాశంలో నేడు అద్భుతంకృష్ణాజిల్లా : ఆకాశంలో నేడు అద్భుతం జరుగనుంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఆకాశంలో పశ్చిమ దిక్కున బృహస్పతి, శని గ్రహాలు పరస్పరం చేరువ కానున్నాయి. కొన్ని గంటలపాటు ఈ గ్రహాలు కలిసే ఉంటాయని కృష్ణాజిల్లా గుడివాడలోని అక్కినేని నాగేశ్వరరావు కళాశాల భౌతిక శాస్త్ర విభాగాధిపతి కొడాలి అనిల్‌ కుమార్‌ తెలిపారు. అతి ప్రకాశవంతమైన బృహస్పతి, శని గ్రహాలు రెండూ 0.1 డిగ్రీల దూరంలో ఒకదానికి ఒకటి దగ్గరగా వస్తాయన్నారు. క్రీస్తు శకం 1623లో బృహస్పతి, శని గ్రహాలు రెండూ ఒకదానికి ఒకటి దగ్గరగా వచ్చినప్పటికీ సూర్యునికి దగ్గరగా ఉండటం వల్ల కనిపించలేదని పేర్కొన్నారు. అయితే, సోమవారం నాటి గ్రహాల కలయికను నేరుగా చూడవచ్చని చెప్పారు. ఉత్తరార్థగోళంలో జరిగే గ్రహ సముచ్ఛయాన్ని ‘స్టార్‌ ఆఫ్‌ బెత్లెహేమ్‌’గా అభివర్ణిస్తారని తెలిపారు. ఈ సముచ్ఛయం మళ్లీ 2080 మార్చి 15న ఉంటుందని వివరించారు. ఈ సన్నివేశం 397 ఏళ్ల తర్వాత జరుగుతున్న అద్భుత కలయిక అన్నారు.