మృతుల కుటుంబాలను ఆదుకుంటాం

మృతుల కుటుంబాలను ఆదుకుంటాంకుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: పెంచికల్ పేట మండలం కొండపల్లి , దహెగాం మండలం దిగడలో పులుల దాడుల్లో మరణించిన నిర్మల, విఘ్నేష్ కుటుంబ సభ్యులను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వ పరంగా బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి బరోసా ఇచ్చారు. పులుల దాడి జరిగిన ప్రదేశాన్ని మంత్రి సందర్శించి, పరిశీలించారు. బాధిత కుటుంబాలకు అటవీశాఖలో వాచర్ ఉద్యోగం ఇచ్చే ఆలోచన చేస్తున్నామని అన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. ఐటీడీఏ నుంచి ఒక్కొక్క బాధిత కుటుంబానికి రూ.25వేలు, టీఆర్ఎస్ పార్టీ తరపున ఒక్కొక్కరికీ రూ.25వేల ఆర్థిక సహాయం చేయనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు తిరిగి జరుగకుండా అటవీ ప్రాంతాలు, అటవీ పరిసర ప్రాంతాల్లో అదనంగా మరో 70 సిసి కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇతర రేంజ్ ల నుంచి పెంచికల్ పేట్ కు అదనంగా 40 మంది సిబ్బందిని తరలించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎమ్మెల్యే కోనప్ప, జెడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మీ, పీసీసీఎఫ్ ఆర్. శోభ, కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌, కవ్వాల్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ వినోద్‌, ఇతర అధికారులు, ప్రజాప్రతినిదులు ఉన్నారు.