భారత్ లో భారీగా పెరిగిన కరోనా, ఒమిక్రాన్ కేసులు

భారత్ లో భారీగా పెరిగిన కరోనా, ఒమిక్రాన్ కేసులున్యూఢిల్లీ : భారత్ లో కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. కరోనా వేరియంట్ వేగంగా విస్తరిస్తుండటంతో రోజువారీ కేసులు 58వేలు దాటాయి. మంగళవారం నమోదైన కేసుల కంటే బుధవారం ఒక్కరో 55 శాతం అధికంగా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 58,097 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 3,50,18,358 కి చేరాయి.

ఇందులో 3,43,21,803 మంది కోలుకున్నారు. మరో 2,14,004 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు 4,82,551 మంది మహమ్మారి వల్ల మృతి చెందారు. మంగళవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 15,389 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 534 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 147.72 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. పాజిటివిటీ రేటు 4.18 శాతానికి చేరిందని పేర్కొంది.

న్యూఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ లో రోజువారీ కరోనా కేసులు అధికమవుతుండటంతో దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య కూడా పెరుగుతున్నది. వీటితో పాటు తమిళనాడు, గుజరాత్ , రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణలో భారీగా పాజిటివ్ కేసుల సంఖ్య నమోదవుతున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 18,466 కేసులు, ఢిల్లీలో 5481, బెంగాల్ లో 9073, కేరళలో 3640, తమిళనాడు 2731, కర్ణాటక 2476, గుజరాత్ 2265, రాజస్థాన్ 1137, తెలంగాణలో 1052, పంజాబ్ లో 1027 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ః

దీనికి తోడు దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తుంది. భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2135కి చేరాయి. ఇప్పటి వరకు 828 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్రం వెల్లడించింది. ఒమిక్రాన్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 653, ఢిల్లీలో 464, కేరళలో 185, రాజస్థాన్ 174, గుజరాత్ 154, తమిళనాడు 121 చొప్పున కేసులు రికార్డయ్యాయి.