16 రోజుల్లోనే గాలిమర తయారు
అద్భుతాలు సృష్టిస్తున్న వజ్రకూరు కుర్రాడు
ఆదరిస్తే మరింత రాణిస్తానని ప్రకటన
అనంతపురం జిల్లా : వారిది నిరుపేద వ్యవసాయ ఆధారిత కుటుంబం. అయినప్పటికీ పట్టువీడకుండా తమ రెక్కలు ముక్కల కష్టం చేసుకుని తమ కుమారున్ని ఉన్నత చదువులు చదివించాలని సంకల్పించారు. అనుకున్నట్లుగానే కొడుకును ఇంజినీరింగ్ చదివిస్తున్నారు. అయితే తల్లిదండ్రుల కష్టాలను గుర్తించిన వారి కుమారుడు చదువులో రాణిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అనంతపురం జిల్లా వజ్రకరూరుకు చెందిన సుంకన్న, సుంకమ్మ దంపతుల కుమారుడు మధు. యువత సమాజానికి ఉపయోగపడేలా ప్రాజెక్టులు రూపొందించాలని ప్రధానమంత్రి మోదీ ప్రసంగించిన వీడియోను కరోనా సమయంలో చూశాడు. విద్యుత్తు, తాగునీటికి సంబంధించి ప్రాజెక్టు చేయాలని నిర్ణయించుకున్నాడు. తన వద్ద ఉన్న రూ.40 వేలు, తల్లి ఇచ్చిన మరో రూ .40 వేలు సమకూర్చుకుని గాలి ద్వారా విద్యుత్తు, తేమ నుంచి పోర్టబుల్ నీటిని తీసేలా గాలిమరను తయారు చేశాడు. దాన్ని వజ్రకూరులోని తన ఇంటి ఆవరణంలో ఏర్పాటు చేశారు. సాధారణంగా ఇలాంటి ప్రాజెక్టును పూర్తి చేయాలంటే 6 నెలల సమయం పడుతుందని, తాను కేవలం 16 రోజుల్లోనే పూర్తి చేశానని మధు తెలిపారు. ఇప్పటి వరకు 50 ప్రాజెక్టుల వరకు చేసి వివిధ ప్రదర్శనల్లో బహుమతులు సాధించాడు. ఈ గాలిమర రోజంతా తిరిగితే 30 యూనిట్ల విద్యుత్తు, 100 లీటర్ల నీటిని ఉత్పత్తి చేస్తుందని తెలిపాడు. ఇలాంటి ప్రాజెక్టు ఎడారి, నీరు, విద్యుత్తు కొరత ఉన్న ప్రాంతాల ప్రజలకు వరంగా ఉంటుందన్నాడు. మధు చేసిన ఈ ప్రమోగాన్ని చూసి పలువురు ఆయనను ప్రశంసిస్తున్నారు. తనను ప్రభుత్వం ఆర్థికంగా ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తున్నానని అంటున్నాడు మధు.