హైదరాబాద్: ఇండియన్ కరెన్సీపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరుశురామ్ కోరారు. అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని కోరుతూ పరుశురామ్ నిర్వహిస్తున్న ప్రజాచైతన్య రథయాత్ర సోమవారం ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకుంది. ఈ సందర్భంగా ఓయూ లా కాలేజీ ప్రిన్సిపాల్ గాలి వినోద్‌కుమార్, వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర్‌రావు, భీమ్ ఆర్మీ వాసుకే యాదవ్, శివ, తెలంగాణ అమరుల సంఘం ,స్వేరో విద్యార్థి సంఘాల నాయకులు స్వాగతం పలికారు. అనంతరం లా కాలేజీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని పలు కూడళ్లలో ప్రచారం చేపట్టిన తర్వాత ఆర్ట్స్ కళాశాల ఎదుట సభ నిర్వహించారు. అంబేద్కర్‌ఫోటో సాధన సమితి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి చింతల సునీల్ అధ్యక్షతన జరిగిన సభలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసిన అంబేద్కర్ ఫోటోను ఇండియన్ కరెన్సీపై ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్నిపరుశురామ్ డిమాండ్ చేశారు. స్వదేశీ ఉద్యమం, మొదటి ప్రపంచ యుద్ధం, జలియన్ వాలాబాగ్ సంఘటనతోపాటు దేశ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో ప్రాణ, ఆర్థిక నష్టం జరిగినప్పుడు, ఇంపిరీయల్ బ్యాంకు కుప్పకూలి నప్పుడు ఆర్థిక కోణాన్ని దృష్టిలో ఉంచుకుని ‘రూపాయి సమస్య పరిష్కార మార్గం’ అనే పుస్తకాన్ని అంబేదర్ 1926లో రాసి బ్రిటిష్ ప్రభుత్వానికి అందజేసినట్లు లా కాలేజీ ప్రిన్సిపాల్ గాలి వినోద్‌కుమార్ గుర్తుచేశారు. ఆ సమయంలో ఆయన రాసిన పుస్తకంతో రూపాయి అవసరాన్ని గుర్తించి 1935 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు.