బాలీవుడ్‌ పై రెహమాన్‌ సంచలన వ్యాఖ్యలు

ముంబై: బాలీవుడ్‌ పరిశ్రమలో ఓ ముఠా తనపై దుష్ప్రచారం చేస్తున్నదని..ఆ కారణంగానే హిందీలో అవకాశాలు తగ్గిపోయాయని ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విజేత ఏ.ఆర్‌.రెహమాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్‌ చిత్రసీమలో నెపోటిజంపై(బంధుప్రీతి) తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో రెహమాన్‌ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్‌ ఇండస్ట్రీలో తనకు అవకాశాలు రాకుండా కుట్రజరుగుతోందని రెహమాన్‌ ఆరోపించారు. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ చివరి చిత్రం ‘దిల్‌ బెచారా’కు రెహమాన్‌ స్వరాల్ని అందించారు. శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. బాలీవుడ్‌ పై రెహమాన్‌ సంచలన వ్యాఖ్యలురెహమాన్‌ మట్లాడుతూ ‘బాలీవుడ్‌లో ఓ ముఠా నాపై తప్పుడు ప్రచారం చేస్తోంది. నేను పాటల కంపోజింగ్‌కు ఎక్కువ సమయం తీసుకుంటానని, అందునే నన్నెవరూ సంప్రదించవొద్దని చెబుతున్నారని తెలిసింది. ‘దిల్‌ బెచారా’ దర్శకుడు ముఖేష్‌ ఛబ్రా నాతో ఈ విషయం చెప్పారు. ఆయన్ని కూడా నాతో సినిమా చేయొద్దని వారించారట. ‘దిల్‌ బెచారా’ చిత్రానికి నేను రెండు రోజుల్లోనే నాలుగు పాటల్ని కంపోజ్‌ చేశాను. హిందీలో గొప్ప సినిమాలకు మ్యూజిక్‌ చేయాలని అభిమానులు ఆశపడుతున్నారు. కానీ ఆ గ్యాంగ్‌ నాకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటోంది. అయినా నేను బాధపడటం లేదు. ఏం జరిగినా దేవుడి కృపగా భావిస్తా’ అని రెహమాన్‌ పేర్కొన్నారు.