ఫుట్‌బాల్‌ దిగ్గజం డిగో మారడోనా(60) కన్నుమూశారు

ఫుట్‌బాల్‌ దిగ్గజం డిగో మారడోనా(60) కన్నుమూశారుఅర్జెంటీన ఫుట్‌బాల్‌ దిగ్గజం డిగో మారడోనా(60) కన్నుమూశారు. 1986లో అర్జెంటీనాకు ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ అందించిన మారడోనా గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వరల్డ్‌కప్‌ విజేత మారడోనా అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌లో గల తన ఇంటిలో బుధవారం మధ్యాహ్నం మరణించారు. ఈ నెల ఆరంభంలోనే మారడోనా ఆస్పత్రిలో చేరారు. తన మెదడులో రక్తం గడ్డకట్టడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. 1960 అక్టోబర్‌ 30న అర్జెంటీనాలో డిగో జన్మించారు. ప్రస్తుతం అర్జెంటీనా ఫుట్‌బాల్‌ జట్టుకు మేనేజర్‌గా ఉన్నారు. 1990 వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అర్జెంటీనా తరఫున 96 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన డిగో 34 గోల్స్‌ చేశాడు. తన కెరీర్‌ ద్వితీయార్థంలో అతడు కొకైన్‌కు బానిసయ్యాడు. 1991లో డోపింగ్‌ పరీక్షలో పట్టుబడి 15 నెలలు నిషేధానికి గురయ్యాడు. నాలుగుసార్లు ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌కు ప్రాతినిధ్యం వహించిన మారడోనా 1997లో ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. 2008లో అర్జెంటీనా జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించారు. యూఏఈ, మెక్సికో జాతీయ జట్టుకు మేనేజర్‌గా కూడా మారడోనా పనిచేశారు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ క్రీడలో తనదైన ముద్రవేసిన మరణ వార్త తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఫుట్‌బాల్‌ దిగ్గజం మారడోనాకు వరంగల్ టైమ్స్ తరపున ఇవే మా నివాళులు.