హైదరాబాద్ : వినాయక నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జన ఉత్సవాలకు ప్రభుత్వం సిద్ధమైనట్లు పేర్కొన్నారు. నిమజ్జన విధుల్లో పాల్గొనే అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. క్రేన్ నంబర్ 5 వద్ద ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం ఉంటుంది. వీలైనంత త్వరగా నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
నిమజ్జన ప్రక్రియలో వారందరికీ మాస్కులు పంపిణీ చేస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో 320 కిలో మీటర్ల పొడవునా గణేష్ శోభాయాత్ర కొనసాగనుంది. నిమజ్జన వేడుకల విధుల్లో 19వేల మంది పోలీసు సిబ్బంది పాల్గొననున్నారు. జిల్లాల నుంచి 7వేల మంది పోలీసులను రప్పించారు. నిమజ్జన విధుల్లో 8,700 మంది శానిటేషన్ సిబ్బంది పాల్గొననున్నారు. రేపు 40 వేల విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి.
నిమజ్జనానికి ట్యాంక్ బండ్ వద్ద 40 క్రేన్లను అందుబాటులో ఉంచారు. వీటితో పాటు మరో 4 క్రేన్లను అదనంగా ఉంచనున్నారు. లైఫ్ జాకెట్లు, బోట్లను కూడా అందుబాటులో ఉంచారు. ట్యాంక్ బండ్ వద్ద 40 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉన్నారు.