బండి సంజయ్ విడుదలపై హైకోర్టులో ఊరట

బండి సంజయ్ విడుదలపై హైకోర్టులో ఊరటహైదరాబాద్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు తెలంగాణ రాష్ట్ర హై కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. వెంటనే బండి సంజయ్ ని విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. కరీంనగర్ లో తనపై నమోదు చేసిన కేసులపై బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై కరీంనగర్ మెజిస్ట్రేట్ ఇచ్చిన జ్యూడిషియల్ రిమాండ్ ఆర్డర్ ను రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

బండి సంజయ్ పిటిషన్ ను విచారించిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉండగా తనపై దాఖలైన రిమాండ్ రిపోర్ట్ ను క్యాష్ చేయాలని బండి సంజయ్ పై తరపు న్యాయవాది దేశాయ్ ప్రకాష్ రెడ్డి హైకోర్టులో బుధవారం వాదనలు వినిపించారు. బండి సంజయ్ పై అక్రమ కేసులు, సెక్షన్స్ నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. ఇదంతా ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా చేసిందని కోర్టుకు విన్నవించారు. సంజయ్ మెజిస్ట్రేట్ జ్యూడిషియల్ కస్టడీ 15 రోజులు చట్టం ప్రకారం సరైంది కాదని న్యాయవాది పేర్కొన్నారు.

న్యాయవాది దేశాయ్ వాదనలు విన్న హై కోర్టు , కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని రిమాండ్ కు ఆదేశాలివ్వడం సరికాదని వెల్లడించింది. అరెస్ట్ చేసిన 15 నిమిషాల్లోనే ఎఫ్ ఐఆర్ ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ లో సెక్షన్ 333 అదనంగా ఎందుకు చేర్చారని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. అనంతరం పోలీసుల తీరును హైకోర్టు తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జనవరి 17 వరకు రిమాండ్ ఇవ్వడం అనేది సరైంది కాదని తెల్పింది. తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది.