ఈ కార్బెవ్యాక్స్ కొవిడ్ వ్యాక్సిన్ కు డీసీజీఐ ఆమోదం

ఈ కార్బెవ్యాక్స్ కొవిడ్ వ్యాక్సిన్ కు డీసీజీఐ ఆమోదంవరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో భారత్ లో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈ తయారు చేసిన కార్బెవ్యాక్స్ కొవిడ్ 19 వ్యాక్సిన్ కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ 12 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల వారికి వినియోగించనున్నారు. దేశంలో ఆర్బీడీ ప్రోటీన్ సాంకేతికపై తయారు చేసిన మొదటి టీకా ఇదే. కంపెనీ నుంచి కేంద్ర ప్రభుత్వం 30 కోట్ల డోసులను సేకరించనుండగా, గత సంవత్సరం ఆగస్టు 2021లో ఆర్డర్ ఇచ్చింది.

బయోలాజికల్ ఈ కంపెనీ కార్బెవ్యాక్స్ 250 మిలియన్ డోసులను ఉత్పత్తి చేసింది. రాబోయే కొద్ది వారాల్లో మిగతా మోతాదులను సైతం సిద్ధం చేయనుంది. గత యేడాది వ్యాక్సిన్ల కొనుగోలు కోసం బయోలాజికల్ ఈ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం రూ. 1500 కోట్లు అడ్వాన్స్ గా చెల్లించిన విషయం విదితమే. ఇటీవల కార్బెవ్యాక్స్ టీకా అత్యవసర వినియోగం కోసం బయోలాజికల్ ఈ డీసీజీఐకి దరఖాస్తు చేసింది. ఈమేరకు నిపుణుల సమావేశమై టీకా అత్యవసర వినియోగానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా కార్బెవాక్స్ టీకా రూ. 145 ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఇందులో పన్నులేవీ ఉండవని తెలుస్తున్నది. 18 యేళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలకు అందుబాటులోకి వచ్చిన రెండో టీకా కాగా, ఇంతకు ముందు కొవాగ్జిన్ కు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. కార్బెవాక్స్ రెండు డోసుల టీకా కాగా, మొదటి మోతాదు ఇచ్చిన 28 రోజుల తర్వాత రెండో డోసు ఇవ్వనున్నారు.