బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం

బొల్లారంలో భారీ అగ్నిప్రమాదంబొల్లారం: సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారిశ్రామిక వాడలోని వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించి, మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో పరిశ్రమ నుంచి కార్మికులు పరుగులు తీశారు. మరికొంతమంది కార్మికులు పరిశ్రమలోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే భయంతో చుట్టుప్రక్కల పరిశ్రమల కార్మికులు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులకు తీవ్రగాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా వుంది. క్షతగాత్రులను బాచుపల్లి ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న 4 అగ్నిమాపక శకటాలు మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం సంభవించడంతో పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలుముకోవడంతో పరిశ్రమలో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. భారీ స్థాయిలో పొగలు అలుముకోవడంతో చుట్టుప్రక్కల పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులను ఆయ పరిశ్రమల యాజమాన్యాలు ఖాళీ చేయిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చుట్టుప్రక్కల పరిశ్రమల్లోని రియాక్టర్లను సిబ్బంది చల్లబరుస్తున్నారు. అయితే పరిశ్రమలోని రియాక్టర్ పేలడం వల్లే అగ్ని ప్రమాదం సంభవించినట్లు స్థానికులు భావిస్తున్నారు.