ఘన్ పూర్ టికెట్ రాజయ్యకే !
వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : స్టేషన్ ఘన్ పూర్ లో టికెట్ కొట్లాట రసవత్తరంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి టికెట్ నాదంటే నాదంటూ ప్రకటనలిచ్చేస్తున్నారు. ఢీ అంటే ఢీ అంటున్నారు. ప్రతిపక్ష నాయకులు ఎటు పోయారో కానీ ప్రతిపక్షాల కంటే ఎక్కువ ఒకరి మీద ఒకరు వాగ్బాణాలు సంధించుకుంటున్నారు. ఈ ఉన్నత విద్యావంతులు ఒకరి మీద ఒకరు పంచులేసుకుంటున్న తీరు మాత్రం చర్చనీయాంశంగా మారింది. రాజయ్య అయితే ఓ అడుగు ముందుకేసి కడియంపై పర్సనల్ గానూ విమర్శలు గుప్పించి హీట్ పుట్టించారు. అందుకే ఘన్ పూర్ రాజకీయం వేడెక్కింది.
*స్టే. ఘన్ పూర్ లో గులాబీకే పట్టం
స్టేషన్ ఘన్ పూర్ లో ప్రస్తుత వాతావరణం బీఆర్ఎస్ కే అనుకూలంగా ఉంది. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివ్రద్ధి కార్యక్రమాలకు తోడు రాజయ్య పనితీరు కూడా గులాబీ హవాకు కారణమనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఘన్ పూర్ లో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ క్యాడర్ ఎక్కువగా ఉన్నారు. ఉంటే రాజయ్య వర్గం, లేదంటే కడియం శ్రీహరి వర్గం అన్నట్లుగా బీఆర్ఎస్ పరిస్థితి ఉంది. ప్రతిపక్షాలు ఉన్నా వారి పరిస్థితి మాత్రం నామమాత్రమే. ఎంతసేపు రాజయ్య, కడియం కొట్లాటతోనే ఇక్కడి రాజకీయం ముందుకు సాగుతుంది.*రాజయ్య పై గుడ్ ఒపినియన్..ఎందుకంటే ?
రాజయ్య గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేయడం, ఆ తర్వాత పదవి నుంచి తొలగింపు, తదనంతర పరిణామాల్లో ఆయన వ్యవహరించిన తీరు మాత్రం కచ్చితంగా ఆయనకు ప్లస్ అనే చెప్పవచ్చు. పదవి నుంచి తొలగించినప్పటికీ ఆయన ఎక్కడా సీఎం కేసీఆర్ పై నోరు జారలేదు. అధిష్టానానికి జీహుజూర్ అనేలా వ్యవహరించారు తప్ప దూకుడు ప్రదర్శించలేదు. దీనికి తోడు ఆయన ప్రజలతో మమేకమైన తీరు కూడా ఆకట్టుకునేలా ఉందంటారు గులాబీ శ్రేణులు.
ఈ కారణాల వల్లే రాజయ్య అంటే బీఆర్ఎస్ పెద్దలకు మంచి ఒపినియన్ ఏర్పడిందని టాక్. ముఖ్యంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దగ్గర రాజయ్యకు మంచి మార్కులున్నాయని ప్రచారం జరుగుతోంది. ఆ కారణం వల్లే 2018లో కడియంను కాదని ఆయనకే టికెట్ ఇచ్చారని గులాబీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు.
*ఆ ఒక్కటి తప్ప రాజయ్యకే ఫస్ట్ ప్రియార్టీ..
అంతా బాగానే ఉన్నా రాజయ్యకు కొంచెం లేడీస్ అంశమే మైనస్ గా మారింది. మహిళలతో ఆయన వ్యవహరించే తీరు బాగుండదనే విమర్శలున్నాయి. ఇదొక్కటే ఆయనకు వ్యతిరేక అంశంగా మారింది. ఈ ఒక్క అంశాన్ని పట్టించుకోకపోతే మాత్రం రాజయ్యకు టికెట్ వచ్చే అవకాశాలు కడియం కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఆ మాటకొస్తే రాజయ్యకు ఫస్ట్ ప్రియార్టీ ఇచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయని టాక్.
*మైనస్ గా మారిన కడియం వ్యవహార శైలి!
ఇక ఘన్ పూర్ నుంచి కడియం కూడా టికెట్ ఆశిస్తున్నప్పటికీ ఆయనకు మాత్రం కలిసొచ్చే అంశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కడియం వ్యవహారశైలే అందుకు కారణమనే వాదన వినిపిస్తోంది. గతంలో టీడీపీలో మంత్రిగా వ్యవహరించడం, ఆ తర్వాత కేసీఆర్ కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా పనిచేయడంతో తాను చాలా పెద్ద నాయకుడినని కడియం భావిస్తారట. తనది కేసీఆర్ రేంజ్ అని సన్నిహితులతో చెప్పుకుంటారట. అందుకే పార్టీ ఎమ్మెల్యేలు, కిందిస్థాయి నాయకులు, క్యాడర్ తో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తారన్న విమర్శ ఉంది.
ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా ఆయన పనిచేసిన సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో కడియం కొంచెం దురుసుగా ప్రవర్తించే వారన్న టాక్ ఉంది. ముఖ్యంగా వినయ్ భాస్కర్, అరూరి రమేష్, రాజయ్య లాంటి ఎమ్మెల్యేలతో చాలా ర్యాష్ గా బిహేవ్ చేసే వారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అప్పట్లో కడియంపై హైకమాండ్ కు కంప్లయింట్ కూడా చేసినట్లు టాక్. దాని ఫలితంగానే కడియంకు కేసీఆర్ రెండో కేబినెట్ లో మినిస్ట్రీ పోస్టు ఇవ్వలేదన్న వాదన ఉంది.
ఒక దశలో మినిస్ట్రీ మాట అటుంచి, ఎమ్మెల్సీ పోస్టు కోసం కూడా కడియం వెయిట్ చేయాల్సి వచ్చింది. ప్రెస్ మీట్ లో తానే సెంట్రిక్ గా ఉండే స్థాయి నుంచి ఆ మూలనో, ఈ మూలనో ఓ చెయిర్ కే పరిమితయ్యే పరిస్థితి వచ్చేసింది. ఆ సమయంలోనే కడియం నొచ్చుకుని, అలకపాన్పు ఎక్కారట. దాన్ని గ్రహించి సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ లో కడియంను దగ్గరకు తీసుకున్నట్లు టాక్. ఆ తర్వాత అంతా సద్దుమణిగి కడియంకు ఎమ్మెల్సీ పోస్టు ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. అంతా బాగానే ఉంది కానీ ఇక ఆయనను ఘన్ పూర్ కు పంపే ఆలోచన మాత్రం బీఆర్ఎస్ పెద్దలకు లేదన్న మాట అయితే బలంగా వినిపిస్తోంది. అందుకే కడియంకు గానీ, ఆయన కూతురు కడియం కావ్యకు గానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశాలు లేవనే విశ్లేషకుల అంచనా.
*పసునూరి టికెట్ కడియంకు కలిసొస్తుందా..!
కడియం శ్రీహరి మరీ పట్టుబడితే వరంగల్ ఎంపీ సీటు ఇవ్వొచ్చన్న టాక్ నడుస్తోంది. పసునూరి దయాకర్ కు టికెట్ ఇవ్వకపోతే ఆ స్థానంలో కడియంకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పసునూరి యాక్టివ్ గా ఉండడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అందుకే ఆయన స్థానంలో కడియం కు టికెట్ ఇవ్వాలనే ఆలోచన జరుగుతోందట. ఫలితంగా ఘన్ పూర్ రాజయ్య, కడియం మధ్య మొదలైన లొల్లికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని సమాచారం.
ఇవన్నీ చూస్తుంటే ఘన్ పూర్ లో రాజయ్యకు టికెట్ దాదాపు లాంఛనమేనని గులాబీ శ్రేణులు బల్లగుద్ది చెబుతున్నారు. అంతేకాదు టికెట్ తో పాటు రాజయ్య గెలుపు లాంఛనమేనని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి రాజయ్యకు టికెట్ వచ్చి, ఏ స్థాయిలో విజయఢంకా మోగిస్తారో అన్నది ఎన్నికల తర్వాతే తేలనుంది. అప్పటిదాకా వెయిట్ అండ్ సీ అనాల్సిందే .!