సీబీఎస్ఈ 12వ తరగతి టర్మ్ 1 పరీక్షా ఫలితాలు రిలీజ్ 

సీబీఎస్ఈ 12వ తరగతి టర్మ్ 1 పరీక్షా ఫలితాలు రిలీజ్

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : 12వ తరగతి సంబంధించిన టర్మ్ 1 పరీక్షల ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( సీబీఎస్ఈ ) శనివారం విడుదల చేసింది. గత సంవత్సరం నవంబర్ – డిసెంబర్ లో 12వ తరగతి టర్మ్ 1 పరీక్షలు నిర్వహించింది. వీటి ఫలితాలను తాజాగా ప్రకటించింది. cbseresults.nic.in, cbse.nic.in, cbse.gov.in లో వీటిని అందుబాటులో ఉంచింది. ఈ ఫలితాలను సంబంధిత స్కూళ్ల ఈమెయిల్స్ కు కూడా సీబీఎస్ఈ పంపింది. దీంతో విద్యార్థులు తమ స్కూళ్ల ద్వారా కూడా ఫలితాల గురించి తెలుసుకోవచ్చు. కాగా, టర్మ్ 1లో నిర్వహించిన కేవలం 35 మార్కుల థియరీ పరీక్షలకు మాత్రమే ఫలితాలను సీబీఎస్ఈ విడుదల చేసింది. దీంతో పాస్ లేదా ఫెయిల్ అన్నది పేర్కొనలేదు.

అయితే టర్మ్ 1లోని మొత్తం 50 మార్కుల కోసం ఆయా స్కూళ్లు ఇంటర్నల్ మార్కులను కలపవచ్చు లేక కలపకపోవచ్చు. అలాగే గైర్హాజరైన విద్యార్థులు మళ్లీ టర్మ్ 1 పరీక్ష రాసే అవకాశం లేదు. దీనికి బదులుగా టర్మ్ 2 లో ఆయా విద్యార్థుల ప్రతిభ ఆధారంగా తుది ఫలితాలను వెల్లడిస్తారు. మరోవైపు 12వ తరగతి టర్మ్ 1 పరీక్షలకు సంబంధించిన రీవాల్యుయేషన్ ఫారమ్ ను సీబీఎస్ఈ త్వరలో విడుదల చేయనుంది. థియరీ పరీక్షల్లో మార్కులపై సంతృప్తి చెందకపోయినా లేదా రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు తమ స్కూళ్ల ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

కాగా, 10, 12 తరగతుల సీబీఎస్ఈ టర్మ్ 2 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి జరుగనున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరంలో మాత్రమే రెండు దఫాలుగా బోర్డు పరీక్షలను సీబీఎస్ఈ నిర్వహిస్తున్నది.