రూ.30కోట్లకు ఐపి పెట్టి పరారైన చిట్ వ్యాపారి 

రూ.30కోట్లకు ఐపి పెట్టి పరారైన చిట్ వ్యాపారి

రూ.30 కోట్లకు ఐపి పెట్టిన మరో చిట్ వ్యాపారి
చిట్టీలు, డిపాజిట్లు వసూలు చేసి ఉడాయించిన వ్యాపారి
చిట్టీల సభ్యులు, డిపాజిట్ దారులకు నోటీసులు

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : వరంగల్‌ లేబర్‌కాలనీ టీఆర్‌టీ కాలనీలో ఒక చిట్టీల నిర్వాహకుడు సుమారు రూ.30 కోట్లకు ఐపీ పెట్టడంతో సభ్యులు లబోదిబోమంటున్నారు. గత దశాబ్ధకాలంగా మూడెడ్ల వెంకటేశ్వర్లు ఇక్కడ చిట్టీలను నిర్వహిస్తూ స్థానికులకు తలలో నాలికగా మారాడు. కల్పవల్లి అసోసియేట్స్‌ పేరుతో ఒక కంపెనీ ప్రారంభించాడు. ఆయన కుటుంబ సభ్యులు ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉండడంతో పాటు అతనిపై నమ్మకం కుదరడంతో ఈప్రాంతంలోని ప్రతీ ఒక కుటుంబం ఆయన నిర్వహిస్తున్న చిట్టిల్లో సభ్యులుగా చేరారు. చిట్టీల నిర్వహణ సక్రమంగా ఉండడంతో పలువురు వడ్డీ ఆశతో లక్షల రూపాయలు అయనకు ఇచ్చారు. గత కొద్ది కాలంగా చిట్టీలు ఎత్తుకున్న వారికి, డిపాజిట్ దారులకు డబ్బులు ఇవ్వడం ఆలస్యం కావడంతో బాధితులు ఆయన ఆఫీసు చుట్టూ ప్రదిక్షిణలు చేస్తున్నారు.రూ.30కోట్లకు ఐపి పెట్టి పరారైన చిట్ వ్యాపారి ఇటీవల డబ్బుల కోసం నిలదీయడంతో కంపెనీ లాస్‌లో ఉందన్న సమాచారం సభ్యులకు చేరవేశాడు. ఈ విషయం సభ్యులకు తెలియడంతో ఇంటికి వెళ్లడం ప్రారంభించారు. కాగా మూడు రోజుల క్రితం దేవుని దర్శనానికి వెళుతున్నట్లు స్థానికంగా చెప్పి వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ కి వెళ్లాడు. అక్కడ నుంచి సభ్యులందరికి ఐపీ నోటీసులు పంపడంతో అందరు అవాక్కయ్యారు. ఈ విషయం దావానంలా ప్రచారం కావడంతో సోమవారం బాధితులు అతని ఆఫీసు ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగంలోకి దిగి బాధితులతో మాట్లాడుతున్నారు. బాధితులు వందల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.