ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ డెడ్ లైన్
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారని, తాడోపేడో తేల్చుకుంటామని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ వేదిక ద్వారా కేంద్రానికి 24 గంటల డెడ్ లైన్ విధించారు కేసీఆర్. 24 గంటల్లోపు ధాన్యం సేకరణపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. వన్ నేషన్ , వన్ రేషన్ విధానాన్ని కేంద్రం అన్ని రాష్ట్రాలకు వర్తింపచేయాలని లేకపోతే రైతులు రోడ్లపైకి వస్తారని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రధాని మోడీ , పీయూష్ గోయల్ కు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని కోరుతున్నానని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ నుంచి సుమారు 2 వేల కి.మీ. దూరం వచ్చి దీక్ష చేస్తున్నాం. ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరు, నరేంద్ర మోడీ ఎవరితోనైనా పెట్టుకో, కానీ రైతులతో మాత్రం పెట్టుకోవద్దని కేసీఆర్ హెచ్చరించారు. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండరు. కేంద్రం ధాన్యం కొనాలని ఢిల్లీలో దీక్ష చేస్తున్నాం. దీక్షకు మద్దతిచ్చేందుకు వచ్చిన రాకేశ్ తికాయత్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సీఎం కేసీఆర్.
ఇక ఉద్యమ పోరాటాల ఫలితంగా 2014లో తెలంగాణ సాధించుకున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక రైతుల కోసం అనేక సంస్కరణలు తెచ్చామని పేర్కొన్నారు. రైతులకు ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధిరించామన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నాం.
సాగుకు సరిపడా నీటిని అందిస్తున్నామని వివరించారు. తెలంగాణలో కోటి ఎకరాల భూమి సాగులోకి వచ్చిందని తెలిపారు. ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లో విద్యుత్ కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయని సీఎం కేసీఆర్ ఈ వేదిక ద్వారా కేంద్రాన్ని ఎద్దేవా చేశారు.