అన్నదాతల ప్రగతితోనే దేశాభివృద్ధి

అన్నదాతల ప్రగతితోనే దేశాభివృద్ధిహైదరాబాద్: అన్నదాతల ప్రగతితోనే దేశాభివృద్ధి దాగి ఉందని, స్వర్ణభారత్ ట్రస్ట్ స్థాపన వెనుక ఉన్న కారణాల్లో రైతుల ఆర్థికాభివృద్ధికి దన్నుగా నిలవడం కూడా ఒకటని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. రైతుల కష్టం కేవలం వారి కోసం మాత్రమే కాదని, లోకానికి అన్నం పెట్టడానికని, అమ్మ తర్వాత అంత గొప్పమనస్సు రైతన్నలదే అని తెలిపారు.  హైదరాబాద్‌లోని ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్ లో ‘రైతు నేస్తం’, ‘ముప్పవరపు ఫౌండేషన్’ సంయుక్తంగా నిర్వహించిన  అవార్డుల ప్రదానోత్సవానికి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సర్వారెడ్డి వెంకురెడ్డికి ‘జీవన సాఫల్య పురస్కారాన్ని’, బ్రిగేడియర్ పోగుల గణేశంకు‘కృషిరత్న’పురస్కారాలను అందజేశారు. అలాగే ఇటీవల ముప్పవరపు ఫౌండేషన్ సహకారంతో, రైతునేస్తం నిర్వహించిన ‘పల్లె పథం’వ్యవసాయ లఘుచిత్రాల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. వీరితో పాటు రైతులు, విస్తరణ విభాగ అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ పాత్రికేయులు తదితరులకు సైతం పురస్కారాలు అందజేశారు.  వ్యవసాయానికి విజ్ఞానం మరింత చేరువ కావాలంటే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలన్న ఉపరాష్ట్రపతి మంచిని ప్రోత్సహించడం భారతీయ సంస్కృతి అని తెలిపారు. మంచి పని చేసిన ఒక్కరిని ప్రోత్సహించడం ద్వారా మరెంతో మంది అదే స్ఫూర్తితో మరెన్నో మంచి కార్యక్రమాల దిశగా ముందుకు వస్తారన్నారు. గత 16 ఏళ్లుగా అన్నదాతలకు రైతునేస్తం, పశునేస్తం, ప్రకృతినేస్తం మాస పత్రికల ద్వారా అన్నదాతలకు చేదోడుగా నిలవడమే గాక, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త  ఐవీసుబ్బారావు పేరిట అవార్డులను అందిస్తున్న రైతునేస్తం వ్యవస్థాపకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్లపల్లి వేంకటేశ్వరరావుకి ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు. ఈ ఏడాది లఘుచిత్ర పోటీల్లో విజేతలను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చిన ముప్పవరపు ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ హర్షకు కూడా అభినందనలు తెలిపారు.‘ఉత్తం ఖేతి మధ్యం వాన్ కరె చాకిరి కుకర్ నినాన్’ అనే హిందీ సామెతను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి భారతదేశ ప్రజలు వ్యవసాయానికి ఎంతో ఉన్నతమైన స్థానం ఇచ్చారని, భారతీయుల దృష్టిలో వ్యవసాయం అంటే సిరులు మాత్రమే కాదని, సంస్కృతి కూడా అని తెలిపారు. అందుకే మన పండుగలు, పబ్బాలు, ఆచార వ్యవహారాలు అన్నీ వ్యవసాయంతో ముడిపడి ఉన్నాయన్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయం, వారసత్వం, శాస్త్రీయ విజ్ఞానం లాంటి ప్రతి అంశంలోనూ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ, బ్రిటీష్ పాలన కాలంలో చదువు రాని వారు మాత్రమే వ్యవసాయం చేస్తారనే ఓ ముద్ర పడిపోయిందని, తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.