రైతుకు సీఎస్​ సోమేశ్‌కుమార్‌ ఫోన్

ధాన్యం కొనాలంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు
స్పందించిన సీఎస్​ సోమేశ్‌కుమార్‌
గిట్టుబాటు ధరకు కొనేలా చూస్తానని హామీ
వెంటనే కలెక్టర్‌కు ఆదేశాలు.. ఆపై కాంటా
కృతజ్ఞతలు తెలిపిన కొండపల్లి యువరైతు శరత్​
గతంలో సీఎం కేసీఆర్‌ నుంచీ కాల్‌ రైతుకు సీఎస్​ సోమేశ్‌కుమార్‌ ఫోన్మంచిర్యాల : ధాన్యం కొనాలంటూ ఓ యువకుడు ఫేస్​ బుక్​లో పోస్ట్​ పెట్టారు. దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఆపై పోస్టు పెట్టిన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లికి చెందిన కొండపల్లి శరత్‌కు రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఫోన్‌ చేశారు. శరత్‌ ఏడెకరాల్లో వరి పండించాడు. ధా న్యాన్ని కొద్ది రోజులు కల్లంలోనే అమ్మకానికి పెట్టగా కొనేందుకు ఎవరూ రాకపోవడంతో ఇటీవల తుఫాన్‌ వస్తుందన్న భయంతో ఇంటికి తీసుకువచ్చాడు. అనంతరం రైస్‌మిల్లర్లు, కొనుగోలుదారులను ఆశ్రయించాడు. క్వింటాలుకు రూ. 1800 కొంటామని చెప్పగా ఇంత తక్కువ ధరకు అమ్మలేనని తెలిపాడు. ఇక విరక్తి చెందిన శరత్​ తన ఫేస్‌ బుక్‌ ఖాతా ద్వారా జై శ్రీరాం వడ్లు అమ్మకానికి పెట్టాం.. కావాల్సిన వారు సంప్రదించండి..’ అని వీడియో పోస్టు చేశాడు. మూడు రోజుల వ్వవధిలోనే దాదాపు ఐదు లక్షల మంది వీక్షించారు. 20 వేల మంది వరకు షేర్‌ చేశారు. ఇది రాష్ట్ర సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ వరకు చేరింది. ఈ పోస్ట్​ చూసిన సీఎస్​ సోమవారం సాయంత్రం వెంటనే రైతు శరత్‌కు ఫోన్‌ చేశాడు. మొదట ఒక సామాన్యుడిగా ఫోన్‌ చేసి ధాన్యాన్ని ఎంతకు అమ్ముతావు?, బయట మార్కెట్‌లో ధర ఎంత ఉంది? మీ దగ్గర కొనుగోలు కేంద్రాలు లేవా? అక్కడ అమ్ముకోవచ్చు కదా? అని ప్రశ్నించారు. చివరకు నేను రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను మాట్లాడుతున్నాని తెలిపారు. మీ ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా చూస్తాననీ, ఇప్పుడే మీ కలెక్టర్‌కు ఆదేశాలు ఇస్తానని శరత్‌కు హామీ ఇచ్చారు. వెంటనే కలెక్టర్‌ భారతీ హోళికేరితో మాట్లాడి విషయం చెప్పారు. ఆమె వెంటనే రైస్‌మిల్లర్ల అసోసియేషన్‌ వారితో మాట్లాడి డీఎస్‌వోకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం కొనుగోలుదారులు నందులపల్లికి వచ్చి శరత్‌ ఇంటి వద్ద ఉన్న 140 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. సహకరించిన సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, కలెక్టర్‌ శరత్‌ కృతజ్ఞతలు చెప్పారు.