కమలం వైపు అసంతృప్తి నేతల చూపు

కమలం వైపు అసంతృప్తి నేతల చూపు

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : వరంగల్ అర్బన్ జిల్లాలో గ్రేటర్ వార్ మొదలైంది. నువ్వా నేనా అన్నట్లు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నాయకులు కౌంటర్లకు రీ కౌంటర్లు వేసుకుంటున్నారు. మొన్నటి దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన సత్తా చాటుకోవడంతో అసలు కథ మొదలైంది. తెలంగాణలో రానున్న ఏ ఎన్నికల్లోనైనా కాషాయం జెండా ఎగురవేయడమే లక్ష్యంగా వారు తమ బలాన్ని రెట్టింపు చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.కమలం వైపు అసంతృప్తి నేతల చూపుకేంద్ర ప్రభుత్వం తెలంగాణలో గ్రేటర్ నగరాల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నప్పటికీ టీఆర్​ఎస్​ ప్రభుత్వ వైఖరితో పాటు, నిధుల మంజూరులో జాప్యం చేయడం వల్లే గ్రేటర్ నగరాల అభివృద్ధి కుంటు పడుతుందంటూ బీజేపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల అభివృద్ధిపై చూపిస్తున్న సవతితల్లి ప్రేమను ఎండగడుతూ బీజేపీ రాష్ట్ర, కేంద్రస్థాయి లీడర్లు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే మొన్నటికి మొన్న వరంగల్ అర్బన్ జిల్లాలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటనతో వరంగల్ లో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.

గ్రేటర్ వరంగల్ అభివృద్ధిలో టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వుందంటూ, గులాబీ బాసులను టార్గెట్ చేసుకుని కిషన్ రెడ్డి చేసిన పర్యటన వరంగల్​లో హాట్ టాపిక్ గా మారింది. పైగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో పలు పార్టీల నుంచి పలువురు నేతలు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ వలసల పరంపర కొనసాగుతూనే వుంది. గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో గౌరవం దక్కనివారు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారు. టీఆర్ ఎస్ లో అవిరళ కృషి, తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించిన అచ్చ విద్యాసాగర్ ను టీఆర్ఎస్ అధిష్టానం గుర్తించకపోవడంతో గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలోనూ అదే తీరు కనిపించడంతో మనస్థాపానికి గురయ్యారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ పర్యటనకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో అచ్చ విద్యాసాగర్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఇది ఇలా ఉంటే ఇదే తరహాలోనే టీఆర్ఎస్ లో అసంతృప్తితో వున్న మరో ఇద్దరు నాయకులు ఒకరు మంత్రి సోదరుడైతే మరొకరు కాంగ్రెస్​నుంచి టీఆర్​ఎస్​లోకి వచ్చిన నాయకుడు బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ నాయకులు ఎవరో తెలుసుకోవాలని ఉందా..అందులో ఒకరు స్వయానా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు అర్బన్​ జిల్లా కో ఆపరేటివ్​ బ్యాంకు చైర్మన్​ ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో పాటు మాజీ శాప్ డైరెక్టర్, టీఆర్ఎస్ వరంగల్ తూర్పు నాయకులు రాజనాల శ్రీహరి బీజేపీలోకి చేరుతున్నారన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

త్వరలో వీరిద్దరూ బండి సంజయ్ సమక్షంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అయితే వీరిద్దరు చేరుతున్నారన్న వార్తలు టీఆర్ఎస్ పార్టీ నేతల్లో తలనొప్పిగా మారింది. ఈ వార్త తెలిసిన వెంటనే మంత్రి ఎర్రబెల్లితో పాటు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రాజనాల శ్రీహరిలతో బుజ్జగింపులు చేస్తున్నారని సమాచారం.

అయినా వీళ్ల బుజ్జగింపులకు వారు ససేమీరా అంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో పాటు రాజనాల శ్రీహరి బీజేపీలో చేరితే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిద్దరు బీజేపీలో చేరితే గనుక రానున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వీరి ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు.

ఇక గ్రేటర్ వరంగల్ విషయానికొస్తే గత గ్రేటర్​ వరంగల్​ ఎన్నికల్లో బీజేపీ అన్ని డివిజన్లలో పోటీ చేయగా కేవలం ఒకే ఒక్క బీజేపీ కార్పొరేటర్ చాడ స్వాతి 45వ డివిజన్​లో విజయం సాధించారు. ఈ ఇద్దరు నాయకులు గనుక బీజేపీ కండువా కప్పుకుంటే మాత్రం రానున్న గ్రేటర్​ వరంగల్​ ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో 20 డివిజన్లపై వీరి ప్రభావం తీవ్రంగా ఉంటుందని రాజకీయ పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి.

ఇక్కడికి సీన్​ కట్​ చేస్తే ఈ నేతలను బీజేపీ పార్టీలోకి వెళ్లకుండా ప్రస్తుతం గులాబీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో రాజనాల శ్రీహరి పార్టీ మారిన తన ప్రభావం టీఆర్​ఎస్​పై ఉండకపోవడంతో ముఖ్యంగా మంత్రి సోదరుడైన ఎర్రబెల్లి ప్రదీప్​రావు సమస్యను టీఆర్​ఎస్​ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే దిశగా గులాబీ బాసులు ప్రయత్నం చేస్తున్నారు. మరీ ఈ గులాబీ నేతలు చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా.? వారు పార్టీ మారుతారా..? వేచి చూద్దాం..