స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్ ప్రకటించిన ప్రభుత్వం
వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : తెలంగాణలో స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు జరిగే సమ్మేటివ్ అసెస్మెంట్-2 (ఎస్ ఏ-2 )పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10 నుంచి ఎస్ ఏ-2 పరీక్షలు జరగాల్సి ఉండగా, దాన్ని మార్చుతూ ఏప్రిల్ 12 నుంచి ప్రారంభించాలని జీవో జారీ చేసింది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు అంటే 48 రోజుల పాటు విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ 12 నుంచి స్కూళ్లు రీ ఓపెన్ అవుతాయి.
మార్చి రెండో వారంలో ఒంటిపూట బడులు
మరోవైపు ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో మార్చి రెండో వారం నుంచి ఒంటి పూట బడులు నడపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించనున్న నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి పరీక్షలను ఏప్రిల్ 12 నుంచి ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 17 వరకు పరీక్షలు, 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఏప్రిల్ 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది.