ఉద్ధవ్ థాకరే వర్గానికి ఈసీ షాక్

ఉద్ధవ్ థాకరే వర్గానికి ఈసీ షాక్ఉద్ధవ్ థాకరే వర్గానికి ఈసీ షాక్

వరంగల్ టైమ్స్, ఢిల్లీ: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. సీఎం ఏక్ నాథ్ షిండేదే అసలైన శివసేన అని ఈసీ అధికారికంగా గుర్తించింది. అంతేకాదు ధనుస్సు, బాణం గుర్తును కూడా షిండే వర్గానికే కేటాయించింది. శివసేన పార్టీలో సంక్షోభం ఏర్పడి అసమ్మతి వర్గం నేత ఏక్ నాథ్ షిండే సీఎం అయ్యాక,మాదే అసలైన శివసేన పార్టీ అంటూ ఏక్ నాథ్ షిండే, ఉద్ధవ్ థాకరే వర్గాలు ప్రకటించుకున్నాయి. అయితే, తాము ఈ సమస్యను పరిష్కరించేంత వరకు ఇరువర్గాలు వేర్వేరు గుర్తులు ఉపయోగించుకోవాలని ఈసీ సూచించింది.

ఈసీ తాజా నిర్ణయంతో సీఎం ఏక్ నాథ్ షిండే హర్షం వ్యక్తం చేశారు. ఇది శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే భావజాలం సాధించిన విజయం అని షిండే అభివర్ణించారు. ఈ సందర్భంగా తాను ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీనే ప్రాతిపదికగా తీసుకుంటారని స్పష్టం చేశారు. తమదే నికార్సయిన శివసేన అని తేలిందని పేర్కొన్నారు. బాలాసాహెబ్ సిద్ధాంతాలను దృష్టిలో ఉంచుకునే తాము బీజేపీతో కలిసి గత యేడాది మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని షిండే వివరించారు.

కాగా, ఏ ప్రాతిపదికన శివసేన పార్టీపై నిర్ణయం తీసుకున్నది ఈసీ వెల్లడించింది. 2019 ఎన్నికల్లో శివసేన పార్టీ తరపున గెలిచిన 55 మంది ఎమ్మెల్యేలు 76 శాతం ఓటింగ్ సాధించారని తెల్పింది. వారందరి మద్దతు ఏక్ నాథ్ షిండేకు ఉందని వివరించింది. అటు, ఉద్ధవ్ థాకరే వర్గం ఎమ్మెల్యేలకు 23.5 శాతం మాత్రమే ఓటింగ్ లభించిందని పేర్కొంది.

ఈసీ నిర్ణయంపై థాకరే వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఈసీ నిర్ణయం ఊహించినదేనని, తాము కొత్త గుర్తుతో ముందుకెళతామని వెల్లడించారు. ఇందులో తామేమీ బాధపడడం లేదని, ప్రజలతో తమ వెంటే ఉన్నారని రౌత్ స్పష్టం చేశారు. శివసేన ఎవరిదో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని అన్నారు.