మహారాష్ట్ర సీఎం సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర సీఎం సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర సీఎం సంచలన వ్యాఖ్యలు

వరంగల్ టైమ్స్, ముంబై : కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తనకు ఇచ్చిన మాట నిలుపుకున్నారని, తన వెంటే బలంగా నిలబడ్డారని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే అన్నారు. ఏక్‌నాథ్ షిండే వర్గానికి శివసేన పేరు, పార్టీ గుర్తు ‘విల్లు-బాణం’ చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిన నేపథ్యంలో షిండే వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. షిండే ఆదివారం ఇక్కడ ఒక కార్యక్రమంలో మాట్లాడారు. మీరు ముందుకు వెళ్లండి, మీ వెనుకాల మేము నిలబడతామని అమిత్‌షా తనతో చెప్పారని, ఆయన చెప్పిందే చేశారని, తన మాట నిలుపుకున్నారని గుర్తు చేశారు.

ఎన్నికల కమిషన్ తీర్పుపై అమిత్‌షా సైతం ఒక ట్వీట్‌లో స్పందించారు. సత్యానికి, అబద్ధానికి ఉన్న తేడా ఈసీ నిర్ణయంతో నిరూపితమైందని ఆయన అన్నారు. సత్యమేవ జయతే ఫార్ములా మరోసారి ఈసీ నిర్ణయంతో రుజువైందని ధీమా వ్యక్తం చేశారు షిండే.

గత ఏడాది జూన్‌లో ఏక్‌నాథ్ షిండే వర్గం అప్పటి మహా వికాశ్ అఘాడి ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. శివసేనలోని 55 మంది ఎమ్మెల్యేలలో 40 మందిని, 18 మంది ఎంపీల్లో 13 మందిని షిండే తన వైపు తిప్పుకున్నారు. దీంతో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కుప్పకూలింది. ఆ వెంటనే బీజేపీతో షిండే పొత్తుపెట్టుకుని మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవిస్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం పార్టీ గుర్తు, పేరు తమకే చెందాలంటూ ఉద్ధవ్, షిండే వర్గం ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాయి. దాదాపు ఎనిమిది నెలల హైడ్రామాకు కేంద్ర ఎన్నికల సంఘం గత శుక్రవారం తెరదించింది.