వైద్య పరీక్షలపై సీఎం ఆరా

వైద్య పరీక్షలపై సీఎం ఆరాఅమరావతి: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన వారికి నిర్వహిస్తున్న వైద్య పరీక్షలపై సీఎం వైఎస్​ జగన్​ మంగళవారం ఆరాతీశారు. ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వైద్య బృందాలు నిర్వహించిన పరీక్షల వివరాలను సీఎం కార్యాలయ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అస్వస్థతకు గురైనవారికి ఎయిమ్స్‌ వైద్య నిపుణుల బృందం నిర్వహించిన పరీక్షల్లో సీసం, నికెల్‌ లాంటి మూలకాలు ఉన్నట్టుగా తెలుస్తోందని మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. అలాగే ఐఐసీటీ కూడా పరీక్షలు చేస్తోందని ఆ వివరాలు కూడా త్వరగా వస్తాయని వెల్లడించారు. బాధితులకు నిర్వహించిన పరీక్షలు అలాగే ఆప్రాంతంలో నీళ్లు, పాలకు నిర్వహించిన పరీక్షల ఫలితాలను ఓ నివేదిక రూపంలో పొందుపరచి ఇవ్వాలని దీనిపై వీడియో కాన్ఫరెన్స్‌కూడా ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రాథమిక పరీక్షల్లో వెల్లడైన అంశాల ప్రకారం సీసం లాంటి మూలకాలు ఎలా ఆ ప్రాంత ప్రజల శరీరాల్లోకి చేరాయో దానికి తగ్గ కారణాలను పూర్తిస్థాయిలో పరిశోధించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్య సిబ్బంది, ఇతర విభాగాలు నిశిత పరిశీలన చేయాలన్నారు. అస్వస్థతకు దారితీసిన కారణాలు, మార్గాలను గుర్తించాలన్నారు. బాధితులకు కొనసాగుతున్న వైద్య చికిత్స, వారికి అందుతున్న సదుపాయాలపై కూడా సీఎం అధికారులతో సమీక్షించారు.