బీజేపీ మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి మృతి

బీజేపీ మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి మృతివరంగల్ టైమ్స్, భూపాలపల్లి జిల్లా : బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగారెడ్డి (87) కన్నుమూశారు. కొంతకాలంగా జంగారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన ఆకస్మిక మృతికి పలువురు సంతాపం తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న మాజీ ఎంపీ జంగారెడ్డి పార్థీవ దేహానికి నివాళులర్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్, ఇంద్రసేన రెడ్డి, బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు, ఇతర నేతలు జంగారెడ్డి మృతికి సంతాపం తెలిపారు.

1935 నవంబర్ 18న వరంగల్ జిల్లాలో జంగారెడ్డి జన్మించారు. ప్రస్తుతం ఆయన హనుమకొండలో నివాసం ఉంటున్నారు. ఉమ్మడి ఏపీలో బీజేపీ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. హనుమకొండ పార్లమెంట్ స్థానం నుంచి పీవీ నర్సింహారావుపై 54 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. జంగారెడ్డి రాజకీయాల్లోకి రాకముందు కొద్ది రోజులు ప్రభుత్వ పాఠశాలలో హయ్యర్ సెకండరీ టీచర్ గా పనిచేశారు.