వేద పాఠశాలను ప్రారంభించిన చీఫ్ విప్ దాస్యం

వేద పాఠశాలను ప్రారంభించిన చీఫ్ విప్ దాస్యంవరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : శ్రీ పంచమిని పురస్కరించుకొని హనుమకొండలోని శ్రీ హనుమద్గిరి పద్మాక్షి అమ్మవారిని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న దాస్యం వినయ్ భాస్కర్ ను ఆలయసంప్రదాయం ప్రకారం అర్చకులు స్వాగతం పలికారు. పద్మాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పద్మాక్షీ అమ్మవారి ఆశీస్సులు నగర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు దాస్యం తెలిపారు. పద్మాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన చీఫ్ విప్ కు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందచేసి, తీర్థప్రసాదాలు అందచేశారు.

అనంతరం చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ దేవాలయ ప్రాంగణంలోని శ్రీ హనుమద్గరి పద్మాక్షి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేదపాఠశాల భవనాన్ని సందర్శించి ప్రారంభించారు. దేవాలయ వంశపారం పర్య అర్చకులు నాగిళ్ళ శంకర్ శర్మ, నాగిళ్ళ షణ్ముఖ పద్మనాభ అవధాని సమక్షంలో నిర్వహిస్తున్న వేదపాఠశాల గురించి విషయాలు తెలుసుకున్నారు. తన వంతు కూడ వేద పాఠశాలకు మరియు దేవాలయానికి కావాల్సిన రోడ్డు, మంచినీటి సౌకర్యం ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. వేద పాఠశాల విద్యార్థులు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని దాస్యం వినయ్ భాస్కర్ హామీ ఇచ్చారు. దీంతో ఆలయ అర్చకులు, వేద పాఠశాల నిర్వహకులు చీఫ్ విప్ కు కృతజ్ఞతలు తెలిపారు.