మాజీ ఎమ్మెల్యే రాజయ్య (59) కరోనా సోకి మృతి

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనా వైరస్‌ సోకి మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యకు కుటుంబీకులు కరోనా పరీక్షలు చేయించారు. ఫలితాల్లో పాజిటివ్‌గా రావడంతో విజయవాడ దవాఖానకు తరలించగా, అక్కడే కన్నుమూశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014లో మూడుసార్లు ఆయన సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన త‌ర్వాత ఏపీలోని తన సొంత గ్రామంలోనే ఉంటున్నారు. సున్నం రాజ‌య్య ఎమ్మెల్యేగా ఎన్నికైన త‌ర్వాత కూడా చాలా సాధార‌ణ‌మైన జీవితాన్ని గ‌డిపారు.. అసెంబ్లీకి ఆటోలో, బ‌స్సులో వెళ్లిన ఏకైక ఎమ్మెల్యే ఆయ‌నే. అసెంబ్లీకి మాత్రమే కాదు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా బస్సులో తిరిగిన సాదాసీదా మనిషి. గత 10 రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా స్వగ్రామమైన సున్నంవారిగూడెంలో వైద్య చికిత్స పొందిన ఆయ‌న‌.. అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు.మాజీ ఎమ్మెల్యే రాజయ్య (59) కరోనా సోకి మృతిఅయితే.. ఇంత‌కు ముందు నిర్వహించిన కరోనా టెస్ట్‌లో నెగెటివ్‌ వచ్చినా సోమవారం భద్రాచలంలో మరోసారి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో విజయవాడకు తరలించి చికిత్స అందిస్తుండగా కన్నుమూశారు. భద్రాచలం నియోజ‌క‌వ‌ర్గం నుంచి సీపీఎం తరఫున మూడుసార్లు గెలిచిన ఆయన.. అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిగా రంపచోడవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇవాళ ఆయన స్వగ్రామం సున్నంవారిగూడెంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన జీవితాంతం కృషి చేసిన రాజయ్య, అత్యంత నిరాడంబర రాజకీయ నాయకుడిగా ప్రజల హృదయాల్లో నిలిచి పోతారని సిఎం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.