జూన్ 1 నుంచి 8వ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు

జూన్ 1 నుంచి 8వ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు

 వరంగల్ టైమ్స్ , గ్రేటర్ వరంగల్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుండి వారం రోజుల పాటు గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వాహణకు మహానగర పాలక సంస్థ సిద్ధమైనది. గ్రేటర్ వరంగల్ లోని 58 డివిజన్లలో జూన్ 1నుంచి 8 వ తేదీ వరకు రోజువారీగా చేపట్టనున్న కార్యక్రమాలపై బల్దియా అధికారులు సిబ్బందితో కలిసి దిశానిర్ధేశం చేశారు. కార్పొరేషన్ లోని 58 డివిజన్లలో పక్కా ప్రణాళిక ప్రకారం రోజువారీ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించుటకు గాను ప్రతీ డివిజన్ కు సానిటరీ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా, ప్రతి ఐదు డివిజన్లకు ఒక సూపర్వైజర్ అధికారిని నియమిస్తూ 4200 సిబ్బంది పారిశుద్ధ్య కార్యక్రమాలు పటిష్టంగా నిర్వహించేలా పర్యవేక్షించడంతో పాటు రోజూ వారి నివేదికలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.జూన్ 1 నుంచి 8వ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలుసోమవారం నాడు ఉదయం 9.30 గంటలకు నగర మేయర్ గుండా ప్రకాశ్ రావు అధ్యక్షతన వరంగల్ ఎల్లంబజార్ లో లాంఛనంగా ప్రారంభించే ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్, మునిసిపల్ కమిషనర్ పమేల సత్పతి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ ద్వారా కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి మధ్య, రాబోయే వర్షాకాలంలో మలేరియా, విరేచనాలు, గ్యాస్ట్రోఎంటెరిటిస్, డెంగ్యూ, టైఫాయిడ్, చికున్‌గున్యా వైరల్ జ్వరం వంటి కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండాప్రజారోగ్యాన్ని కాపాడటానికి ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ 2020 ద్వారా పూర్తి పారిశుధ్య కార్యకలాపాలు నిర్వహించి వ్యాధుల నివారణకు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

లోతట్టు ప్రాంతాల్లో, గుంతలమయమైన రోడ్లు , స్లమ్ ఏరియాల్లో వర్షపు నీరు నిలువకుండా చర్యలు తీసుకొంటారు.అన్ని పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రంగా ఉంచడంతో పాటు పెద్ద మురుగు కాలువలలో పూడిక చెత్తను తీయడం , బ్లీచింగ్ పౌడర్ చల్లడం, సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని, ఆంటీ లార్వా ద్రావణాలను పిచికారీ చేయడం జరుగుతుంది. ఖాళీ ప్లాట్ లను గుర్తించి పిచ్చి చెట్లను, పొదలను తొలగిస్తారు.