హైదరాబాద్ చేరుకున్న తారక్ కు గ్రాండ్ వెల్కమ్
వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్: ఆస్కార్ వేడుకల అనంతరం జూనియర్ ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఫ్యాన్స్ తారక్ కు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఎన్టీఆర్ పేరుతో ఉన్న జెండాలు పట్టుకుని జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జూ.ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆస్కార్ రావడంపై హర్షం వ్యక్తం చేశాడు. ఆస్కార్ అవార్డు మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. కీరవాణి, చంద్రబోస్ అవార్డు పట్టుకుని స్టేజీపై నిల్చున్నప్పుడు ఆనందంగా అనిపించిందన్నారు. రాజమౌళి చేతిలో ఆస్కార్ అవార్డు చూసినప్పుడు తన కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పుకొచ్చారు. అది మాటల్లో వర్ణించలేనిదన్నారు.
మన దేశ బరువు ఎంత వుందో, ఆస్కార్ అవార్డు బరువు కూడా అంతే ఉందని తారక్ వెల్లడించారు. భారతీయుడిని అందులో తెలుగువాడిని అయినందుకు చాలా గర్వపడుతున్నానని అన్నాడు. ఇంతటి గౌరవాన్ని దక్కించుకోవడానికి కారణం అభిమానులు, సినీ ప్రేక్షకులేనని , వారి ప్రేమ, ఆశీస్సుల వల్లే ఈ అవార్డు సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ ఫిల్మ్ ను ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరికీ తారక్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక అవార్డు వచ్చిన వెంటనే మొదటిగా తన భార్య ప్రణతికి ఫోన్ చేసినట్లు తారక్ ఈ సందర్భంగా తెలిపాడు.