వరంగల్ టైమ్స్, హైదరాబాద్: ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న 8 మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. బుధవారం బీఆర్కే భవన్ నుండి టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ , హెల్త్ సెక్రెటరీ రిజ్వీతో కలిసి ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్య, అర్ అండ్ బి అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ క్రమంలో ఈ సారి కొత్తగా 8 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, ఎన్ ఎం సి నిబంధనల మేరకు నిర్మాణాలు ఉండాలని అధికారులకు సూచించారు.
నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దని, ఆధునిక పద్ధతుల్లో నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో కాలేజీల నిర్మాణ పనుల పురోగతి గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ నిర్మాణాలు వేగంగా పూర్తి అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. పురోగతిని రోజు వారీ సమీక్షించాలని, భవన నిర్మాణ పనులు పూర్తయిన చోట మెడికల్ కాలేజీ నిర్వహణకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలన్నారు. నిర్మాణ పనులలో వేగాన్ని పెంచేందుకు ప్రతీ కాలేజీకి ఒక ఇంజనీరింగ్ అధికారిని ఏర్పాటు చేయాలని టీఎస్ఐఐసీ మరియు ఆర్ అండ్ బి అధికారులను హరీశ్ రావు ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఇఎన్సీ గణపతి రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, డి ఎం ఇ రమేష్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండి చంద్రశేఖర్ రెడ్డి, అర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.