భారీగా పట్టుబడిన నిషేధిత ఉత్పత్తులు

భారీగా పట్టుబడిన నిషేధిత ఉత్పత్తులువరంగల్ అర్బన్ జిల్లా: వరంగల్ నగరంలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలకు పాల్పడుతున్న మహబూబాబాద్ జిల్ల తొర్రూరు మండల కేంద్రానికి చెందిన పాము శ్రీనివాస్ ను వర్ధన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి రూ.4 లక్షల విలువ గల గుట్కా, తొమ్మిది అంబర్ ప్యాకెట్ల బ్యాగ్ లు, ఒక కారు, రూ.40వేల480 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను వర్ధన్నపేట ఎ.సి.పి. రమేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో నిందితుడు పాము శ్రీనివాస్ కర్ణాటక రాష్ట్రం బీదర్ పట్టణంలో పెద్ద మొత్తంలో పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ దిశగా హైదరాబాద్, సూర్యాపేట, తొర్రూరు మీదుగా వరంగల్ నగరంలో గుట్కా, అంబర్ ప్యాకెట్ల బ్యాగులను విక్రయించేందుకు తనకారులో వరంగల్ నగరానికి పయనమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న వరంగల్ వెస్ట్ జోన్ డి.సి.పి. శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు వర్ధన్నపేట సర్కిల్ ఇన్స్ పెక్టర్ విశ్వేశ్వర్ , ఎస్.ఐ వంశీకృష్ణ తన సిబ్బందితో కలిసి ఇల్లందు గ్రామ శివారు ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో తొర్రూరు నుంచి వస్తున్న నిందిదుడి కారును పోలీసులు ఆపి తనిఖీ చేశారు. కారులో గుట్కా బ్యాగులను గుర్తించిన పోలీసులు నిందితుడు పాము శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. గుట్కా విక్రయాలకు పాల్పతున్నట్లుగా నిందితుడు పాము శ్రీనివాస్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పెద్ద మొత్తంలో పొగాకు ఉత్పత్తులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచినే వర్ధన్నపేట సర్కిల్ ఇన్స్ పెక్టర్ విశ్వేశ్వర్, ఎస్.ఐ వంశీకృష్ణ, కానిస్టేబుళ్ళు సురేశ్, బుచ్చిరాజు, రమేష్ లను ఎ.సి.పి. రమేష్ కుమార్ అభినందించారు.