టీబీజేపీ నేతలపై హైకమాండ్ అసంతృప్తి!!

టీబీజేపీ నేతలపై హైకమాండ్ అసంతృప్తి!!

టీబీజేపీ నేతలపై హైకమాండ్ అసంతృప్తి!!

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరీ : ఓవైపు బీఆర్ఎస్ అంటూ సీఎం కేసీఆర్ రణనినాదం చేస్తుంటే, తెలంగాణ బీజేపీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో ఫైర్ రావడం లేదని కమలం పెద్దలు భావిస్తున్నారట. టీబీజేపీ నేతల పనితీరుపై అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే బీజేపీ రాష్ట్ర నాయకులకు పార్టీ పెద్దలు ఫోన్ చేసి, మందలించినట్లు కూడా సమాచారం.

*టీబీజేపీ నేతలపై హైకమాండ్ గుర్రు..
ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ మీటింగ్ ఉంది. జాతీయస్థాయి నేతలను తీసుకొచ్చి, నేషనల్ లెవల్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా వారం రోజులుగా మోడీ సర్కారును, బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కానీ బీజేపీ నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో ప్రతిఘటన లేదన్న గుసగుసలు ఢిల్లీ బీజేపీలో ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఓవైపు ప్రతీ రోజూ గులాబీపార్టీ నుంచి మంత్రులు, నేతలు కేంద్రంపై నిప్పులు చెరుగుతుంటే, మీడియాలోనూ అదే హైలైట్ అవుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. కాబట్టి ఆ విమర్శలకు కౌంటరివ్వడంలో టీబీజేపీ నేతలు అలసత్వం ప్రదర్శిస్తున్నారని కమలం పార్టీ హైకమాండ్ భావిస్తోందట. అంతేకాదు బండి సంజయ్, అరవింద్ తప్ప ఇతర నేతలెవ్వరూ పెద్దగా మాట్లాడడం లేదని కూడా పార్టీ పెద్దలు గుర్తించినట్లు సమాచారం.

*వచ్చే ఎన్నికల్లోపైనా యాక్టివ్ అయ్యేనా !
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే టీబీజేపీ నేతలు ఇంకా యాక్టివ్ కావాలని అమిత్ షా టీమ్ భావిస్తోంది. రానున్న కాలంలో కేసీఆర్ మరింత వేగం పెంచడం ఖాయం. బీజేపీ నేతలు కూడా ఆస్థాయిలో కౌంటర్లు ఇస్తేనే కేసీఆర్ వేగాన్ని అందిపుచ్చుకోగలమని కమలం హైకమాండ్ ఆలోచిస్తోందట. అందుకే రాష్ట్ర బీజేపీ నేతలు కొందరికి పార్టీ అధిష్టానం గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఇలాగైతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని హెచ్చరించినట్లు టాక్. ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ కు ధీటుగా స్పందించాలని గట్టిగానే చెప్పినట్లు వార్తలొస్తున్నాయి.

*అసంతృప్తి జాబితా పెద్దదే మరీ..
బీజేపీ హైకమాండ్ పార్టీలోని ఎవరిపట్ల అయితే అసంతృప్తిగా ఉందో ఆ జాబితా పెద్దగానే ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అనుకున్న స్థాయిలో పెర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్న నాయకుల జాబితాలో ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు పార్టీకి సంబంధించిన కీలక పదవుల్లో ఉన్న మరో ఇద్దరిపైనా కూడా హైకమాండ్ అసంతృప్తితో ఉన్నట్లు టాక్. సదరు నాయకులు ఎప్పుడు? ఎలా మాట్లాడారు? ఎలాంటి విమర్శలు చేశారు? బీఆర్ఎస్ కు ఎలాంటి కౌంటర్ ఇచ్చారు? లాంటి సమాచారమంతా అధిష్టానం పెద్దలు సేకరించారట. ఆ వివరాలన్నింటినీ ఆరా తీసి మరీ, పార్టీ నాయకులకు స్ట్రాంగ్ క్లాస్ తీసుకున్నట్లు టాక్.

బీజేపీ హైకమాండ్ తెలంగాణ రాజకీయాలను ఇంత సీరియస్ గా తీసుకుందో ఈ తాజా పరిణామాలను బట్టే అర్థం చేసుకోవచ్చంటున్నారు విశ్లేషకులు. కాబట్టి ఇంతకుముందులా నామ్ కే వాస్తేగా మాట్లాడితే కమలం పెద్దలు ఊరుకునే పరిస్థితి అయితే లేదని స్పష్టమవుతోంది. మరి ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నేతలు ఇంకా యాక్టివ్ అవుతారా? లేక అధిష్టానం మరింత సీరియస్ అయి.. అసలుకే ఎసరొచ్చే వరకు చూసుకుంటారా? అన్నది చూడాలి.