ప్రజల మనిషి నోముల : బండారు దత్తాత్రేయ

ప్రజల మనిషి నోముల : బండారు దత్తాత్రేయహైదరాబాద్​: బడుగు బలహీన వర్గాల సమస్యలపై నిరంతరం పోరాటం చేసి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజల మనిషి నాగార్జున్​సాగర్​ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అని హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ అన్నారు. నోముల మృతి పట్ల మంగళవారం ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పేద, వెనుకబడిన కులాల నేపథ్యం నుంచి రాజకీయాల్లో ప్రవేశించి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం చాలా గొప్ప విషయం అన్నారు. నల్గొండ జిల్లా ప్రజల కోసం అనేక విధాలుగా పోరాటాలు చేసి జైలుకు కూడా వెళ్లారని పేర్కొన్నారు. వారి కుమార్తె వివాహానికి హాజరైనప్పుడు తనను సొంత కుటుంబ సభ్యుడిగా ఎంతో ఆత్మీయతతో ఆహ్వానించారని గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.