సైలన్ బాబా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్నహోంమంత్రి అలీ
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : సైలాని బాబా దర్గా 115 వ హజ్రత్ సైలన్ బాబా గంధం(ఉర్సు) ఉత్సవాల్లో హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పరకాల నియోజకవర్గం దామెర మండలం ఒగ్లాపూర్ గ్రామ శివారులోని సైలాని బాబా దర్గాలో మంగళవారం సాయంత్రం జరిగిన 115 వ హజ్రత్ సైలన్ బాబా గంధం(ఉర్సు) ఉత్సవాల్లో హోంమంత్రి మహమూద్ అలీతో పాటు ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ లు పాల్గొన్నారు. ఉర్సు ఉత్సవాలకు హాజరైన హోంమంత్రి మహమూద్ అలీకి దర్గా నిర్వహకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ ప్రార్థనలు చేసినట్లు హోంమంత్రి తెలిపారు. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉర్సు ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తారని నిర్వహకులు తెలిపారు. సైలాని బాబా దర్గా ఉర్సు ఉత్సవాల్లో వరంగల్ డిప్యూటీ మేయర్, రిజ్వాన-మసూద్, పరకాల మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామక్రిష్ణ, హనుమకొండ ఆర్డిఓ వాసు చంద్ర, తహసిల్దర్ రియాజ్, మైనార్టీ నాయకులు, సైలాని బాబా నిర్వహకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.