రాహుల్ ప్రధాని ఐతే..ఏపీకి ప్రత్యేక హోదా
విజయనగరంలో పర్యటించిన రుద్రరాజు
‘చేయి చేయి కలుపుదాం..రాహుల్ గాంధీని బలపరుద్దాం’ కార్యక్రమం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపాటు
అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్న పీసీసీ చీఫ్
వరంగల్ టైమ్స్, విజయనగరం : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. రాహుల్ ప్రధాని అయిన వెంటనే ఆయన పెట్టే తొలి సంతకం ఏపీ ప్రత్యేక హోదా ఫైలు మీదేనని పేర్కొన్నారు. నిన్న విజయనగరం జిల్లాలో పర్యటించిన రుద్రరాజు ‘చేయి చేయి కలుపుదాం..రాహుల్ గాంధీని బలపరుద్దాం’కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్న ఆయన, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘ఇంటింటా కాంగ్రెస్ కరపత్రం’ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్‌ను కలిసి తమను కాపాడాలని వినతిపత్రం ఇవ్వడం బాధాకరమన్నారు. జగన్ ప్రభుత్వ రాక్షస పాలనకు ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలన్నారు. తాము అధికారంలోకి వస్తే విశాఖ పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని రుద్రరాజు పేర్కొన్నారు.